Training AI Robots: తలకి కెమెరాలతో ఇంటి పని.. వీళ్లకి గంటకి రూ.250.. ఆ వీడియోలతో ఏం చేస్తారనేగా మీ డౌట్..!

తలలకు కెమెరాలు లేదా స్మార్ట్‌ఫోన్లు అమర్చుకుని రోజువారీ పనులను చిత్రీకరిస్తున్నారు. ఈ వీడియోలే భవిష్యత్తులో మనుషుల్లా పనిచేసే రోబో(Training AI Robots)లకు పాఠాలుగా మారనున్నాయి.

Indian workers earn rs 250 per hour by training ai with daily household tasks

  • AI కోసం పనులు రికార్డ్ చేస్తున్న కార్మికులు
  • తలకు కెమెరాలతో గంటకు రూ.250 ఆదాయం
  • రోబోలకు శిక్షణగా మారుతున్న రోజువారీ పనులు

Training AI Robots: ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ అనేది ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. ఇప్పటివరకు కంప్యూటర్లకు సమాచారం అందించే పని ప్రధానంగా డిజిటల్‌ డేటాపైనే ఆధారపడి ఉండేది. అయితే ఇప్పుడు మనుషులు చేసే రోజువారీ పనులను నేర్చుకునే హ్యూమనాయిడ్‌ రోబోలను అభివృద్ధి చేయడానికి కొత్త తరహా డేటా అవసరమవుతోంది. అందుకే భారతదేశంలో గృహిణులు, కార్మికులు, చిన్న వ్యాపారులు తమ తలలకు కెమెరాలు లేదా స్మార్ట్‌ఫోన్లు అమర్చుకుని రోజువారీ పనులను చిత్రీకరిస్తున్నారు. ఈ వీడియోలే భవిష్యత్తులో మనుషుల్లా పనిచేసే రోబోలకు పాఠాలుగా మారనున్నాయి.

రోజువారీ పనులే AIకి డేటా:

చెన్నైకి చెందిన 25 ఏళ్ల నాగిరెడ్డి శ్రీ రామచంద్ర ప్రతిరోజూ ఇంటి పనులు చేస్తూ వాటిని వీడియోగా రికార్డ్‌ చేస్తోంది. పండ్లు కోయడం, వంటగదిలో పనులు చేయడం వంటి సాధారణ కార్యకలాపాలను తలకు అమర్చుకున్న స్మార్ట్‌ఫోన్‌తో చిత్రీకరించి AI (Training AI Robots)డేటా కంపెనీలకు పంపుతోంది. ఇందుకు గంటకు రూ.250 వరకు పారితోషికం అందుతోంది. ఈ ఫస్ట్‌-పర్సన్‌ వీడియోలను “ఎగోసెంట్రిక్‌ డేటా”గా పిలుస్తారు. మనిషి కళ్లతో ప్రపంచాన్ని చూసినట్లుగా ఉండే ఈ డేటా ద్వారా రోబోలు వస్తువులను ఎలా పట్టుకోవాలి, ఎలా కదలాలి, ఎలా పని చేయాలనే విషయాలను నేర్చుకుంటాయి.

AI పరిశ్రమలో భారత్‌ కీలక కేంద్రం:

ప్రస్తుతం AI డేటా సేకరణ, ప్రాసెసింగ్‌, లేబెలింగ్‌ రంగాల్లో భారత్‌ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. వేలాది మంది కార్మికులు ఈ రంగంలో పనిచేస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్‌కు పైగా హ్యూమనాయిడ్‌ రోబోలు వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇటువంటి డేటా సేకరణ సేవలకు డిమాండ్‌ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. AI అభివృద్ధికి అవసరమైన మానవ ప్రవర్తన నమూనాలను అందించడంలో భారతీయుల పాత్ర కీలకంగా మారుతోంది.

అవకాశాలతో పాటు ఆందోళనలు:

అయితే ఈ సాంకేతిక విప్లవం ఉపాధిపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. బెంగళూరుకు చెందిన 55 ఏళ్ల పూలదండలు తయారు చేసే పొన్ని కూడా కెమెరా ధరించి తన పనిని రికార్డ్‌ చేసింది. అయితే భవిష్యత్తులో రోబోలు ఇలాంటి పనులు చేపడితే ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు కొత్త ఆదాయ అవకాశాలు, మరోవైపు ఉద్యోగ భద్రతపై సందేహాలు… AI యుగంలో భారతీయ కార్మికులు ఈ రెండు వాస్తవాల మధ్య ప్రయాణిస్తున్నారు. మరి ఈ ఆధునిక ప్రయాణం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాలి.