మందగమనం తేడాకొడుతోంది. 15 ఏళ్ల దిగువకు చేరిన సేవింగ్స్

  • Publish Date - February 20, 2020 / 06:43 AM IST

ఏ ముహూర్తాన మన ఆర్ధికవ్యవస్థను ఏనుగుతో పోల్చారోకాని పరుగులు తక్కువ, నడక ఎక్కువ. కొన్నేళ్లు ఆర్ధికవృద్ధిరేటు 7 దాటితే అంతలోనే ఆయాసం. ఇప్పుడు నీరసించిన వృద్ధిరేటు మనం దాచుకున్న సేవింగ్స్ ను మింగేస్తోంది. అందుకే మన పొదుపు 15 ఏళ్లలో అతి తక్కువకు, జాతీయోత్పత్తిలో 30.1% శాతానికి పడిపోయింది. అంతకుముందు ఇది 34.6శాతం. 2003లో అతి తక్కువ పొదుపు అంటే 29శాతం. ఆ తర్వాత ఈ ఏడాదే అతి తక్కువ.

ఖర్చు చేస్తే తప్పేంటి?
మార్కెట్ లోకి మనీ వస్తుంది, వ్యాపారం కళకళ్లాడుతోందని మీరనొచ్చు. మన ప్రభుత్వాలేవీ పొదుపుచేయవు, కంపెనీలు అంతే. రూపాయి ఆదాయం వస్తే అంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తాయి. మొత్తం దేశం చేసే పొదుపులో జనం చేసే పొదుపు 60శాతం. మొత్తం జాతీయోత్పత్తిలో వీళ్ల వాట 21 శాతం నుంచి 18శాతానికి పడిపోయింది.  దీనర్ధం జనం ఎక్కువ ఖర్చుచేస్తున్నారు. లేదంటే పిల్లలకు ఫీజులుకడుతున్నారు, ఇప్పుడున్నవన్నీ పైసల్ బడులేకదా. ఫీజులెక్కువ. ఇక రోగమొచ్చి ఆసుపత్రికెళ్తే, బిల్లు లక్షల్లో.

పొదుపుతగ్గితే ఎందుకింత గోలంటారా?
ఆదాయం వచ్చినప్పుడు కొంత సొమ్మును పక్కనపడేస్తే కష్టకాలంలో ఆదుకొంటుంది. రిటైర్ అయిన తర్వాత భరోసా ఉండాలికదా! లేదంటే పిల్లల మీద, మరెవరోమీద ఆధాపడాల్సివస్తుంది. మనకేకాదు, ప్రభుత్వాలకీ మన పొదుపు సొమ్ముకావాలి.  ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలంటే నిధులుకావాలి. మనం దాచుకొనే సొమ్ముమీద వడ్డీ ఇస్తామని వాడుకొంటుంది. 

జనం తక్కువ ఖర్చుచేసి, ఎక్కువ ఆదాచేస్తారుకాబట్టి… ప్రపంచ ఆర్ధికమాంద్యప్రభావం తక్కువ.  అంతర్జాతీయ సంస్థల నుంచి ఎక్కువ వడ్డీకి అప్పుతెచ్చుకోనక్కర్లేదు. అదే పొదుపు తగ్గితే మన సంస్థలకు పెట్టుబడి తగ్గుతుంది. వాళ్లు ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకోవాలి. దానివల్ల విదేశీ అప్పులు పెరుగుతాయి. 2014-15లో మన విదేశీ రుణ భారం 475 బిలియన్ డాలర్లుంటే, అదికాస్తా కిందటి యేడాదికి 543 బిలియన్ డాలర్లకు చేరింది. మన ఆర్దికమంత్రేమో మీరు పొదుపుచేయొద్దు, బైటకెళ్లి ఖర్చు చేయండి కులాసాగా బతకండని మనల్ని ప్రోత్సహి,స్తున్నారు. ఆర్ధికమంత్రికి కావాల్సింది మార్కెట్లోకి మనీరావడం. అంతేకాని పొదుపుకాదు.  

తెలుసుకోవాల్సిన ఆర్దిక పాఠం?
దేశం ఆర్ధికంగా నిలబడేదే జనం చేసే పొదుపుమీద. మనం చేసే సేవింగ్స్ పెట్టుబడిగా మారి ఆర్ధికవ్యవస్థకు కొత్త ఊతమిస్తుంది, పరుగులెట్టిస్తుంది. అప్పుడు మళ్లీ మనకు డబ్బు వస్తుంది, మళ్లీ మనం పొదుపుచేస్తాం.