“బహిరంగంగా క్షమాపణలు చెప్పండి”.. ఐదుగురు ఇన్‌ఫ్లుయెన్సర్లకు సుప్రీంకోర్టు ఆదేశం.. ఎందుకంటే?

దివ్యాంగులను లక్ష్యంగా చేసుకున్నందుకు రైనా సహా ఐదుగురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై జరిమానాలు విధిస్తామని కూడా సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది.

“బహిరంగంగా క్షమాపణలు చెప్పండి”.. ఐదుగురు ఇన్‌ఫ్లుయెన్సర్లకు సుప్రీంకోర్టు ఆదేశం.. ఎందుకంటే?

Supreme Court

Updated On : August 25, 2025 / 6:08 PM IST

Supreme Court: దివ్యాంగులను ఎగతాళి చేసిన ఐదుగురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్లలో “ఇండియాస్ గాట్ లాటెంట్” వ్యాఖ్యాత సమయ్ రైనా కూడా ఉన్నాడు.

ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెంచ్‌.. ఇతర కమ్యూనిటీల (వికలాంగులు, మహిళలు, పిల్లలు, వృద్ధుల) మనోభావాలను దెబ్బతీసేలా ఇచ్చే కమర్షియల్ స్పీచ్‌కు వాక్‌ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ వర్తించదని పేర్కొంది.

దివ్యాంగులను లక్ష్యంగా చేసుకున్నందుకు రైనా సహా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై జరిమానాలు విధిస్తామని కూడా సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. (Supreme Court)

Also Read: రిచ్‌ లైఫ్‌స్టైల్, లగ్జరీ.. ఇంత హ్యాపీగా గడిపిన అమ్మాయిని.. ఎంతగా వేధించారో.. హృదయాన్ని ద్రవింపజేస్తున్న వీడియో

వికలాంగులు, మహిళలు, పిల్లలు, వృద్ధులను దూషించే, ఎగతాళి చేసే వ్యాఖ్యలను నియంత్రించేందుకు సోషల్ మీడియా మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

సోషల్ మీడియా నియంత్రణ కోసం చేసే మార్గదర్శకాలు తొందరపాటు చర్యలుగా కాకుండా, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది.

ఆయా ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రతి ఒక్కరు తమ యూట్యూబ్ ఛానెల్స్, పాడ్‌కాస్ట్‌లలో క్షమాపణ చెబుతారని, దీన్ని నిర్ధారిస్తూ కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేస్తారని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు హామీ ఇచ్చారు.

“హాస్యం జీవితంలో భాగం. కానీ, ఇతరులను ఎగతాళి చేస్తూ, సామాజిక స్థాయిలో భావజాలానికి భంగం కలిగించినప్పుడు అది సమస్యగా మారుతుంది. నేటి ఇన్‌ఫ్లుయెన్సర్లు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. వారు ప్రసంగాన్ని కమర్షియల్‌గా ఉపయోగిస్తున్నారు.

మనోభావాలను దెబ్బతీయడానికి దాన్ని వాడొద్దు. అది వాక్‌ స్వాతంత్ర్యం మాత్రమే కాదు, కమర్షియల్ స్పీచ్ కూడా” అని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది.

న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జయమాల్య బగ్చీతో కూడిన బెంచ్ జరిమానా అంశాన్ని తరువాత నిర్ణయిస్తామని తెలిపింది. వాదన సమయంలో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. “హక్కులు, కర్తవ్యాల మధ్య సమతుల్యం ఉండాలి” అని వ్యాఖ్యానించారు.