రిచ్‌ లైఫ్‌స్టైల్, లగ్జరీ.. ఇంత హ్యాపీగా గడిపిన అమ్మాయిని.. ఎంతగా వేధించారో.. హృదయాన్ని ద్రవింపజేస్తున్న వీడియో

ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఇప్పుడు 58,000కుపైగా ఫాలోవర్లు ఉన్నారు. అదే ఖాతాలో నిక్కీ.. మెర్సిడెస్‌లో కనిపించింది. ఈ హృదయవిదారక వీడియోపై నెటిజన్లు ఇప్పుడు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

రిచ్‌ లైఫ్‌స్టైల్, లగ్జరీ.. ఇంత హ్యాపీగా గడిపిన అమ్మాయిని.. ఎంతగా వేధించారో.. హృదయాన్ని ద్రవింపజేస్తున్న వీడియో

Greater Noida dowry victim

Updated On : August 25, 2025 / 5:00 PM IST

Dowry Death Case: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో అదనపు వరకట్నం కోసం 28 ఏళ్ల మహిళ నిక్కీ భాటికి అత్తింటివారు నిప్పు అంటించి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమె గతంలో తీసుకున్న ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

నిక్కీ భాటి గతంలో కారు నడుపుతూ హాయిగా నవ్వుతూ ఈ వీడియో తీసుకుంది. చక్కగా తయారై, గెలుపు సింబల్ చూపుతూ ఆమె గడిపింది. ఆమె చాలా రిచ్ లైఫ్‌స్టైల్ గడిపినట్లు తెలుస్తోంది. (Dowry Death Case)

నిక్కీ భాటితో పాటు ఆమె సోదరిని కూడా ఆమె తండ్రి ఒకే ఇంటికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఇద్దరు సోదరీమణులు కలిసి బ్యూటీ పార్లర్ నడిపారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ చానెల్‌ల ద్వారా ప్రచారం చేశారు.

అందులో ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఇప్పుడు 58,000కుపైగా ఫాలోవర్లు ఉన్నారు. అదే ఖాతాలో నిక్కీ మెర్సిడెస్‌లో కనిపించింది. ఈ హృదయవిదారక వీడియోపై నెటిజన్లు ఇప్పుడు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

కాగా, పోలీసులు నిక్కీ హత్య కేసులో ఇటీవల తెలిపిన వివరాల ప్రకారం.. నిక్కీ తన బ్యూటీ పార్లర్‌ను తిరిగి ప్రారంభించాలనుకుంది. దీన్ని ఆమె భర్త విపిన్ భాటి వ్యతిరేకించాడు.

తమ కుటుంబంలో రీల్స్ చేయడం, పార్లర్ నడపడం వంటివి కుదరవని చెప్పాడు. దీనిపై వాదనలు జరిగాయి, అది హింసకు దారితీసి, అతను ఆమెకు నిప్పంటించే వరకు వెళ్లింది.

నిక్కీ, ఆమె సోదరి కంచన్ ఇద్దరూ 2016 డిసెంబరులో అదే కుటుంబంలోని సోదరులను పెళ్లి చేసుకున్నారు. నిక్కీ విపిన్‌ని, కంచన్ అతని సోదరుడు రోహిత్‌ని వివాహం చేసుకుంది.

పెళ్లి జరిగినప్పటి నుంచి నిక్కీ వరకట్న వేధింపులు ఎదుర్కొంటోందని ఆమె కుటుంబం ఆరోపించింది. అప్పటికే స్కార్పియో కారు, రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్, బంగారం, నగదు ఇచ్చినా, అత్తింటి వారు ఇంకా రూ.36 లక్షలు డిమాండ్ చేశారని నిక్కీ కుటుంబ సభ్యులు చెప్పారు.

నిక్కీ అనేకసార్లు వేధింపుల కారణంగా ఆమె తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్లింది. పెద్దలు నచ్చజెప్పి తిరిగి అత్తారింటికి పంపేవారు. కాగా, ఆగస్టు 21న నిక్కీపై జరిగిన ఘోరమైన దాడికి సంబంధించిన వీడియోలు బయటపడ్డాయి.

ఒక వీడియోలో నిక్కీ నేలపై కూర్చుని ఉండగా, పార్లర్‌లో వాడే థిన్నర్ (రంగులు, రసాయనాలు పలచగా చేసేందుకు ఉపయోగించే ద్రవం) ఆమెపై పోస్తున్న వ్యక్తి కనిపించాడు.

మరొక వీడియోలో విపిన్ ఆమెను దారుణంగా కొడుతున్న దృశ్యాలు ఉన్నాయి. మూడో వీడియోలో తీవ్రమైన గాయాలతో నిక్కీ మెట్లు దిగుతూ కుప్పకూలిపోయింది. నిక్కీ చిన్న కుమారుడు, సోదరి వాంగ్మూలాలు పోలీసులు తీసుకున్నారు.