ICC T20I Rankings : టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సంజూ శాంసన్, ఇషాన్ కిషన్.. పడిపోయిన సూర్య, తిలక్ ర్యాంక్స్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో (ICC T20I Rankings ) భారత ఆటగాళ్లు దుమ్ములేపారు.
Team India player Ishan Kishan career best in ICC T20I Rankings
ICC T20I Rankings : ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ విజేతగా నిలిచింది. భారత జట్టు విజయంలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. తాజాగా వీరు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లోనూ దుమ్ములేపారు. ఈ ర్యాంకింగ్స్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు టాప్-2లో నిలవడం విశేషం.
టీ20 ప్రపంచకప్ 2026లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మెరుపు అర్థశతకాన్ని బాదిన టీమ్ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతడి ఖాతాలో 875 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక మెగాటోర్నీలో 9 మ్యాచ్‌ల్లో 317 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇది ఇషాన్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ కావడం గమనార్హం. ఇక ఇషాన్ ఖాతాలో 871 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అభిషేక్, ఇషాన్ ల మధ్య కేవలం 4 రేటింగ్ పాయింట్లే ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్‌లలో బాగా ఆడిన న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకోగా ఇంగ్లాండ్‌కు చెందిన జాకబ్ బెథెల్ ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 16వ స్థానానికి చేరుకున్నాడు. తిలక్ వర్మ ఓ స్థానం దిగజారి ఏడో స్థానంలో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు దిగజారి 9వ స్థానానికి పడిపోయాడు.
ఇక టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన సంజూ శాంసన్ ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 22వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ శివమ్ దూబే నాలుగు స్థానాలు ఎగబాకి 27వ స్థానంలో నిలిచాడు.
టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ -5 ఆటగాళ్లు వీరే..
* అభిషేక్ శర్మ (భారత్) – 875 రేటింగ్ పాయింట్లు
* ఇషాన్ కిషన్ (భారత్) – 871 రేటింగ్ పాయింట్లు
* సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్) – 848 రేటింగ్ పాయింట్లు
* ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్) – 792 రేటింగ్ పాయింట్లు
* పాతుమ్ నిస్సాంక (శ్రీలంక) – 766 రేటింగ్ పాయింట్లు..
ఇక బౌలర్ల విభాగంలో గత కొంతకాలంగా అగ్రస్థానంలో నిలిచిన భారత స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రెండో స్థానానికి పడిపోయాడు. అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. రషీద్ ఖాతాలో 753 రేటింగ్ పాయింట్లు ఉండగా, వరుణ్ ఖాతాలో 740 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక టాప్-10 బౌలర్ల జాబితాలో వరుణ్ కాకుండా భారత్ నుంచి బుమ్రా మాత్రమే ఉన్నాడు. అతడు ఓ స్థానం ఎగబాకి 702 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానం దక్కించుకున్నాడు.
టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ -5 ఆటగాళ్లు వీరే..
* రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్) – 753 రేటింగ్ పాయింట్లు
* వరుణ్ చక్రవర్తి (భారత్) – 740 రేటింగ్ పాయింట్లు
* అబ్రార్ అహ్మద్ (పాకిస్థాన్) – 736 రేటింగ్ పాయింట్లు
* ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్) – 721 రేటింగ్ పాయింట్లు
* కార్బిన్ బాష్ (దక్షిణాఫ్రికా) – 704 రేటింగ్ పాయింట్లు
ఇక ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే.. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా అగ్రస్థానంలో నిలవగా భారత స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా రెండో స్థానంలో నిలిచాడు. రజా ఖాతాలో 328 రేటింగ్ పాయింట్లు ఉండగా, పాండ్యా ఖాతాలో 299 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
