Slowest Train in India : సైకిల్ కన్నా మెల్లగా వెళ్లే రైలు.. ఇండియాలో నెమ్మదిగా ప్రయాణించే రైలు ఇదే.. 46 కి.మీ ఎన్ని గంటలు పడుతుందో తెలుసా?
Slowest Train in India : భారతదేశంలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు ఏదో తెలుసా? ఈ రైలు గంటకు సగటున కేవలం 9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
- Harish Thanniru
- Updated on- October 15, 2026 / 09:51 PM IST
Slowest Train in India
Nilgiri Mountain Railway : భారతీయ రైల్వేల్లో వందే భారత్, రాజధాని వంటి వేగవంతమైన రైళ్ల గురించి తరచూ వింటుంటాం. కానీ మన దేశంలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు ఏదో తెలుసా? ఈ రైలు గంటకు సగటున కేవలం 9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంతేకాదు, సుమారు 46 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి దాదాపు ఐదు గంటల సమయం పడుతుంది.
Also Read : Petrol Price : ప్రపంచంలోనే అత్యంత చౌకగా పెట్రోల్ లభించే దేశాలివే ఇవే.. అక్కడ చాక్లెట్ కంటే చీపు!
నెమ్మదిగా వెళ్లినప్పటికీ ఈ రైలులో ప్రయాణించేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే ఇందులో ప్రయాణం కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడమే కాదు.. ప్రమాణ మార్గంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అనుభూతిని పొందవచ్చు. ఈ ప్రత్యేకమైన రైలు ప్రయాణించేది ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు పక్కరాష్ట్రమైన తమిళనాడులోని నీలగిరి పర్వత ప్రాంతాల్లో ప్రయాణించే నీలగిరి మౌంటైన్ రైల్వే. దీనిని ‘ఊటీ టాయ్ ట్రైన్’ (Ooty Toy Train) అని పిలుస్తారు.
నీలగిరి మౌంటైన్ రైల్వే తమిళనాడులోని మేట్టుపాళయం నుంచి ఊటీ (ఉదగమండలం) వరకు ప్రయాణిస్తుంది. సుమారు 46 కిలోమీటర్ల ఈ మార్గంలో కొండలు, దట్టమైన అడవులు, పచ్చని తేయాకు తోటలు, సొరంగాలు, వంతెనలు ప్రయాణికులకు కనువిందు చేస్తాయి.
సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ రైలు వేగం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ మార్గంలోని ప్రకృతి అందాలను దగ్గరగా చూసేందుకు నెమ్మదిగా ప్రయాణించడం పర్యాటకులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ఈ రైలులోని పాతకాలపు బోగీలు, కొండల మధ్య మెలికలు తిరుగుతూ సాగే పట్టాలు ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.
ఈ రైలు నెమ్మదిగా ప్రయాణించడానికి మరో కారణం ఉంది. నీలగిరి కొండ ప్రాంతాల్లోని ఎత్తైన వాలులు, ప్రమాదకరమైన మలుపులు, ఇరుకైన మార్గం కారణంగా ఈ రైలు నెమ్మదిగా వెళ్తుంది. కొండపైకి ఎక్కే మార్గాల్లో రైలు సురక్షితంగా ప్రయాణించేందుకు ప్రత్యేకమైన రాక్ అండ్ పినియన్ వ్యవస్థ ఉపయోగిస్తారు. ఈ సాంకేతికత కొండ ప్రాంతాల్లోని నిటారైన వాలులను అధిగమించడానికి సహాయపడుతుంది.
ఈ రైలు మార్గం నిర్మాణం 19వ శతాబ్దం చివర్లో ప్రారంభమై, 1908 నాటికి పూర్తయింది. దీని చారిత్రక ప్రాధాన్యం, ప్రత్యేక ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని గుర్తిస్తూ యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన భారతదేశంలోని పర్వత రైల్వే మార్గాల్లో దీనికీ స్థానం లభించింది.
నీలగిరి మౌంటైన్ రైల్వేకు సినిమాల ద్వారా కూడా మంచి గుర్తింపు లభించింది. షారుఖ్ ఖాన్ నటించిన దిల్ సే చిత్రంలోని ప్రముఖ పాట ‘చయ్య చయ్యా’ ఈ రైలుతో అనుబంధం కలిగి ఉండటంతో ఈ రైల్వే మార్గంపై మరింత ప్రచారం ఏర్పడింది. పచ్చని కొండలు, తేయాకు తోటలు, సొరంగాలు, వంతెనల మధ్య సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తుంది.
వేగం కంటే ప్రయాణంలోని అందాలను ఆస్వాదించాలనుకునేవారికి ఈ రైలు ప్రయాణం చక్కటి ఎంపిక. ఊటీ సందర్శనకు వెళ్లే పర్యాటకులు ఈ చారిత్రక రైలులో ప్రయాణించేందుకు ముందుగానే టికెట్ల వివరాలు పరిశీలించుకోవడం మంచిది.
