Indigo Flight : ఇండిగో విమానంలో ఒక్కసారిగా మంటలు.. శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలేం జరిగిందంటే?
Indigo Flight : ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు సంబంధించి పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- October 11, 2026 / 05:15 PM IST
Indigo Flight Makes Emergency Landing
- ఢిల్లీ–చెన్నై విమానంలో చెలరేగిన మంటలు
- విమానంలో కలకలం.. శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- గాల్లో ఉండగా పవర్ బ్యాంక్‌లో మంటలు.. అసలేం జరిగిందంటే?
Indigo Flight : ఢిల్లీ నుంచి చెన్నైకి బయలుదేరిన ఇండిగో విమానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి చెందిన పవర్ బ్యాంక్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
దాంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
పవర్ బ్యాంక్ నుంచి మంటలు.. ప్రయాణికుల్లో ఆందోళన :
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న విమానంలో ప్రయాణ సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న పవర్ బ్యాంక్ నుంచి మంటలు చెలరేగడంతో విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం భద్రతను దృష్టిలో ఉంచుకుని విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.
ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, విమానంలో మంటలు ఎలా వ్యాపించాయి అనే అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. విమానాశ్రయ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. పవర్ బ్యాంక్ తీసుకొచ్చిన ప్రయాణికుడిని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పవర్ బ్యాంకులతో జాగ్రత్త :
లిథియం బ్యాటరీలతో పనిచేసే పవర్ బ్యాంకులు అధికంగా వేడెక్కినా, దెబ్బతిన్నా లేదా సాంకేతిక లోపాలు ఏర్పడినా మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. అందుకే విమాన ప్రయాణ సమయంలో బ్యాటరీల భద్రతకు సంబంధించిన నిబంధనలను ప్రయాణికులు తప్పనిసరిగా పాటించాలి.
పవర్ బ్యాంక్ అసాధారణంగా వేడెక్కడం, ఉబ్బిపోవడం లేదా దెబ్బతిన్నట్లు కనిపిస్తే దాన్ని వాడొద్దు. విమానంలో బ్యాటరీ నుంచి పొగ లేదా మంటలు వచ్చినట్లు గుర్తిస్తే స్వయంగా ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయొద్దు. వెంటనే విమాన సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.
