Madurai Gold Heist : సోషల్ మీడియాలో స్టార్.. స్నేహితుడికోసం భారీ దొంగతనం.. చివరికి దిమ్మతిరిగే ట్విస్ట్..

Madurai Gold Heist : తమిళనాడులోని మదురైలో సంచలనం సృష్టించిన ప్రముఖ నగల దుకాణం దోపిడీ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు.. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Madurai Gold Heist

Madurai Gold Heist : తమిళనాడులోని మదురైలో సంచలనం సృష్టించిన ప్రముఖ నగల దుకాణం దోపిడీ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు.. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో లక్షలాది ఫాలోవర్లను సంపాదించుకుంటూ సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న ఒక యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కలిసి ఈ భారీ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సినీ ఫక్కీలో పక్కాప్లాన్‌తో 15కిలోల బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకెళ్లిన ఈ ముఠా గుట్టును ప్రత్యేక బృందాలు రట్టు చేశాయి. అయితే, ఇక్కడే అసలు కథ మొదలైంది.

Also Read : Traffic Challan : ఇదేం పద్దతి సామీ..! కారుకు చలానా వేశారు సరే.. మరి అట్లాంటిక్‌ సముద్రంలోకి ఎలా వెళ్లింది?

మధురైలోని తనిష్క్ షోరూమ్‌లో సెప్టెంబర్ 4వ తేదీన రాత్రి సమయంలో భారీ నగల దోపిడీ జరిగింది. ముసుగు ధరించిన ఓ వ్యక్తి షోరూమ్‌లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డాడు. దాదాపు 15 కిలోల బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దుకాణం యాజమానులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకిదిగి విచారణ చేపట్టారు. తొలుత సీసీటీవీ కెమెరాల్లో ఒక వ్యక్తి మాత్రమే కనిపించడంతో అతడే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు భావించారు. కానీ, విచారణ లోతుగా కొనసాగించగా.. పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. నగల దోపిడీకి పాల్పడింది ఒక్కరు కాదు.. మరికొందరు ఉన్నట్లు గుర్తించారు.

పోలీసులు విచారణ ముమ్మరం చేయగా.. మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. నగల దోపిడీ కేసులో ఉన్న వ్యక్తుల్లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. నిందితుడి సన్నిహితురాలైన ఇన్‌ఫ్లుయెన్సర్‌ మీనాక్షి, అతడి తండ్రి అశోక్‌కు కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడికావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. సోషల్‌ మీడియాలో ప్రముఖంగా కనిపించే ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ పేరు కోట్ల విలువైన నగల చోరీ కేసులో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.

ఈ కేసులో మీనాక్షి పాత్రపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. చోరీ చేసిన నగలను ఎక్కడ దాచారో ఆమెకు ముందే తెలుసని మదురై నగర పోలీసు అధికారి వెల్లడించారు. ఆమెను అరెస్టు చేసిన తరువాత నగలను దాచిన ప్రాంతం గురించి కీలక సమాచారం లభించింది. దీంతో పోలీసులు ఓ నిర్మానుష్య ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి ఐదు కిలోలకుపైగా నగలను స్వాధీనం చేసుకున్నారు.

మీనాక్షికి తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో లక్ష మందికిపైగా అనుచరులు ఉన్నారు. ఆమె ప్రధానంగా సాంకేతిక ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. అంతేకాకుండా సుమారు 10 లక్షల మంది అనుచరులున్న ‘టెక్‌బాస్‌ ఇండియా’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీతోనూ ఆమెకు సంబంధం ఉంది. నిషాంత్‌ కూడా ఆమెతో కలిసి పలు వీడియోల్లో కనిపించాడు. సోషల్ మీడియాలో సెలబ్రెటీగా ఉన్న యువతికి నగల చోరీ కేసులో ప్రమేయం ఉందని వార్తలు రావడంతో ఆమె అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన యూట్యూబర్ నిశాంత్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు, మిగిలిన 10 కిలోల బంగారాన్ని రికవరీ చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.