Tamil Politics : తమిళ రాజకీయాల్లోకి హీరో శివకార్తికేయన్..! హాట్ టాపిక్‌గా ఫ్యాన్స్ మీట్ ..

Tamil Politics : తమిళనాడులో ప్రస్తుతం హీరో శివకార్తికేయన్‌ పేరు మారుమోగిపోతోంది. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని.. కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇందుకు ప్రధాన కారణం ఉంది.

Actor Sivakarthikeya

Tamil Politics : తమిళనాడు రాజకీయాలను, అక్కడి సినీ పరిశ్రమను విడదీసి చూడలేము. సినీ హీరోల ప్రభావం తమిళ రాజకీయాలపై కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయకాంత్.. ఇలా అనేక మంది సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పారు. ముఖ్యమంత్రులుగానూ కొనసాగారు.. అదేకోవలో ప్రస్తుతం విజయ్ తమిళనాడు సీఎంగా ఉన్నారు. విజయ్ తరహాలో రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తాచాటేందుకు పలువురు తమిళ హీరోలు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీరిలో ధనుష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా.. ప్రస్తుతం శివకార్తికేయన్ పేరు తెరపైకి వచ్చింది.

Also Read : Gold Rate Falls : దీపావళి నాటికి పసిడి రూ.లక్షకు చేరడం ఖాయమా..? నిపుణులు చెప్పిన విషయాలివే..

తమిళనాడులో ప్రస్తుతం హీరో శివకార్తికేయన్‌ పేరు మారుమోగిపోతోంది. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని.. కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇందుకు ప్రధాన కారణం ఉంది. ఇటీవల కార్తికేయన్ అభిమానుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలో నిర్వహించిన ఈ సమావేశంకు 2వేల మందికి పైగా హాజరయ్యారు. వారంతా ఒకే తరహా తెల్ల చొక్కాలు ధరించి హాజరయ్యారు. అంతేకాదు.. బ్యానర్లు, జెండాలతో సమావేశం రాజకీయ మీటింగ్‌ను తలపించింది. దీంతో శివకార్తికేయన్‌ రాజకీయ ఎంట్రీపై చర్చ మొదలైంది. అయితే దీనిపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ సమావేశంలో శివకార్తికేయన్ తన అభిమానులతో మాట్లాడారు. తనను ‘సెల్ఫ్‌మేడ్ స్టార్’ అని పిలవడం కంటే ‘పీపుల్ మేడ్ స్టార్’ అని పిలవడమే తనకు ఇష్టమని చెప్పారు. తన స్టార్‌డమ్‌కు ప్రజలు, అభిమానులే కారణమని పేర్కొన్నారు. అభిమానులు తమ లక్ష్యంపై స్పష్టతతో ఉండాలని, విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగాలని సూచించారు. బాగా చదువుకోవాలని, బాగా సంపాదించాలని, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు పుస్తకాలు చదవాలని కూడా అభిమానులకు సూచించారు.

ప్రస్తుతం శివకార్తికేయన్ అభిమానుల సమావేశం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంకు 2వేల మందికిపైగా హాజరుకావడం.. వారంతా ఒకే తరహా తెల్లటి షర్టులు ధరించి హాజరు కావడంతోపాటు.. శివ కార్తికేయన్‌ను ఉద్దేశించి భావి సీఎం అంటూ నినాదాలు చేయడం చర్చకు దారితీసింది. భవిష్యత్తులో ఆయన రాజకీయాలపై ఏదైనా స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తారా అన్నదే ఇప్పుడు తమిళనాడులో ఆసక్తికరంగా మారింది. అయితే, ఆయన రాజకీయాల్లోకి వస్తే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా.. ఉన్న పార్టీల్లో ఏ పార్టీకైనా మద్దతుగా నిలుస్తారా అనే అంశం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.

శివకార్తికేయన్ రాజకీయాల్లోకి వస్తారనే అంశాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. తమిళనాడులో హీరోలకు అభిమాన సంఘాలు ఉండటం సర్వసాధారణం. కొందరు హీరోలు వారితో ప్రతీయేటా సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు. అదే తరహాలో శివకార్తికేయన్ తమ అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసి ఉంటారని అంటున్నారు. అభిమానులతో సమావేశం కావడం సర్వసాధరణ విషయమే అయినా.. తాజా సమావేశంలో.. ఒకే తరహాలో అందరూ తెల్ల షర్టులు ధరించి రావడం.. శివకార్తికేయన్ బొమ్మతో ఉన్న జెండాలతో రావడం.. భావి సీఎం అంటూ నినాదాలు చేయడంతో సమావేశం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.