Tamil Nadu Politics: తమిళ్ థ్రిల్లర్.. ఊహించని ట్విస్టులు.. తమిళనాట కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ..
సంపూర్ణ మెజారిటీ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానిస్తామని గవర్నర్ తేల్చి చెప్పారు. మెజారిటీ లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కుదరదని గవర్నర్ స్పష్టంగా చెప్పేశారు.
- Naveen
- Updated on- May 7, 2026 / 06:19 PM IST
Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయం క్షణానికో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రెండుసార్లు గవర్నర్ రాజేంద్ర అర్లెకర్ ను కలిశారు టీవీకే చీఫ్ విజయ్. 108 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా.. కావాల్సిన మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటునకు విజయ్ కు రెండుసార్లు అనుమతి నిరాకరించారు గవర్నర్. సంపూర్ణ మెజారిటీ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానిస్తామని గవర్నర్ తేల్చి చెప్పారు. మెజారిటీ లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కుదరదని గవర్నర్ స్పష్టంగా చెప్పేశారు.
118 మంది సభ్యుల వివరాలు ఇవ్వాల్సిందేనని గవర్నర్ క్లారిటీ ఇచ్చారు. పుదుచ్చేరిలోని రిసార్ట్ లో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల క్యాంప్ ఉంది. ఉదయం లెఫ్ట్ పార్టీలతో టీవీకే నేతలు సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. అటు స్టాలిన్ తో వీసీకే నేతల చర్చలు జరిగాయి. ఇక రేపు లెఫ్ట్ పార్టీ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ కు మద్దతిచ్చే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో అన్నాడీఎంకే బిజీగా ఉంది. పుదుచ్చేరిలోని ఓ రిసార్ట్ లో అన్నాడీఎంకేకి చెందిన 47 మంది ఎమ్మెల్యేలను ఉంచారు. విజయ్ పార్టీకి ఎమ్మెల్యేల అవసరం ఉన్న నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నాడీఎంకే చెబుతోంది. మరోవైపు తాము డీఎంకే కూటమిలోనే ఉంటామని, స్టాలిన్ తోనే కలిసి ఉంటామని వీసీకే నేతలు తేల్చి చెప్పారు. టీవీకేకి మద్దతిచ్చే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వీసీకేకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.
మరోవైపు వామపక్షాలకు (సీపీఐ, సీపీఎం) చెరో రెండు స్థానాలు ఉన్నాయి. ఆ పార్టీలకు చెందిన రాష్ట్ర కార్యదర్శులు, ఎమ్మెల్యేలు రేపు భేటీ కాబోతున్నారు. తమ జాతీయ నాయకత్వంతో చర్చించబోతున్నారు. ఏ విధంగా ముందుకెళ్లాలి, డీఎంకే కూటమిలోనే భాగస్వామిగా ఉండాలా? లేక కాంగ్రెస్ తరహాలో డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకే పార్టీకి మద్దతివ్వాలా అన్నదానిపై రేపు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
వామపక్షాలు, వీసీకే నుంచి సానుకూల నిర్ణయాలను విజయ్ ఆశిస్తున్నారు. వారు తమకు మద్దతు తెలిపితే ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. దాంతో ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరైనట్లే. ఇప్పటికే కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతుతో టీవీకే స్థానాల సంఖ్య 112కి చేరింది. ఇప్పుడు సీపీఐ నుంచి 2, సీపీఎం నుంచి 2, వీసీకే నుంచి 2.. ఈ 6 వచ్చాయంటే 118 మ్యాజిక్ ఫిగర్ అందుకోవచ్చు. వారి నుంచి సానుకూల నిర్ణయం ఉంటుందనే ఆశాభావంతో విజయ్ ఉన్నారు. మరి వీసీకే కానీ కమ్యూనిస్టులు కానీ రేపు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు అనేది ఉత్కంఠగా మారింది.
