Cooking Oil Price Hike
Cooking Oil Price Hike : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుంది. యుద్ధం కారణంగా ఇప్పటికే వంట నూనెల ధరలు పెరిగాయి.. మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే రవాణా ఖర్చులు పెరిగి.. అన్ని రాష్ట్రాల్లోనూ నూనె ధరలు మరో 10శాతం నుంచి 15శాతం పెరగడంతోపాటు.. ఇతర దేశాల నుంచి సరఫరా అయ్యే ప్రతీ వస్తువుల ధరలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
Also Read : AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు? సర్కార్ ఆలోచన ఏంటి?
ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గత ఐదు రోజులుగా ప్రపంచ మార్కెట్లు షేక్ అవుతున్నాయి. పెట్రోల్, చమురు, డీజిల్‌పై ప్రభావం నేరుగా పడనుందనే అందోళనలతో దేశంలో అనేక రంగాలు ప్రభావితమవుతున్నాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడనుంది. మరోవైపు యుద్ధం కారణంగా సామాన్యులు ఊహించని విధంగా వంటనూనె ధరలు పెరిగాయి.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం భారత దేశంపై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధం కారణంగా రోజువారీ జీవితంలో ఉపయోగించే వంట నూనెల ధరలు పెరగడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఒక్కసారిగా వంట నూనె ధరలు పెరగడంతో మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతవారం వరకు స్థిరంగా ఉన్న ధరలు ఈ వారం లీటరుకు సుమారు రూ. 6 నుంచి రూ. 5 వరకు పెరిగాయి. మార్కెట్ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే వారాల్లో మరింత పెరుగుదల కనిపించే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అంటే.. వచ్చే వారానికి లీటర్‌కు మరో రూ.10 నుండి రూ.15 వరకు పెరిగే అవకాశమూ ఉందని అంచనా వేస్తున్నారు.
గత వారం ధరలతో పోలిస్తే ఈవారం వంట నూనెల ధరల్లో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది. గోల్డ్ విన్నర్ గతవారం లీటర్ ధర రూ.161 ఉండగా.. ఈ వారం రూ.165కు చేరింది. సన్ ఫ్లవర్ ధర గతవారం రూ.161 ఉన్న ధర ఇప్పుడు రూ.165కు పెరిగింది. ఫార్చూన్ గత వారం రూ.152 ఉండగా.. ఈ వారం రూ.157గా నమోదైంది. ఇతర ప్రముఖ బ్రాండ్ల నూనెల ధరలు కూడా రూ.4 నుంచి రూ.5 వరకు పెరిగాయి. ఇది కేవలం ఒకవారంలో జరిగిన మార్పులు మాత్రమేకాగా.. యుద్ధం పరిస్థితులు మరింత కాలం కొనసాగితే ఈ పెరుగుదల మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.
యుద్ధం ప్రభావం ముఖ్యంగా సముద్ర మార్గాల ద్వారా రవాణా అవుతున్న వస్తువులపై ప్రభావం చూపుతోంది. భారతీయులకు అవసరమైన వంట నూనెలలో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. సన్‌ఫ్లవర్ నూనె, పామ్ ఆయిల్ వంటి నూనెలను యుక్రెయిన్, రష్యా, ఇండోనేషియా, మలేషియా, మధ్య ప్రాచ్య ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. యుద్ధ పరిస్థితుల కారణంగా ఆయా దేశాల నుంచి వచ్చే నౌకాశ్రయ రవాణా పూర్తిగా స్తంభించింది. హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చే నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భారత దేశంలో నూనెలతోపాటు ఇతర వస్తువుల ధరలుసైతం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగితే భారతదేశం వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు భారీగా పెరిగే చాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటితోపాటు పప్పు ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి రావాల్సిన షిప్‌మెంట్‌లు ఆగిపోవడంతో ఖర్జూరం ధరలు 10-20 శాతం పెరిగాయి. బాదం, పిస్తా ధరలు కూడా 5 నుంచి 8శాతం వరకు పెరిగాయి. వీటితోపాటు మరికొన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం త్వరగా ముగియాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు.