Ranchi Assembly March: జార్ఖండ్‌లో భగ్గుమన్న విద్యార్థి ఉద్యమం.. పోలీసుల లాఠీఛార్జ్.. సంచలనం రేపుతున్న అసెంబ్లీ మార్చ్
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ , జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షల లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి(Ranchi Assembly March) కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.
- V Santhosh Kumar
- Updated on- August 10, 2026 / 02:05 PM IST
Jharkhand students protest ranchi assembly march jpsc jssc cbi inquiry demand
- జార్ఖండ్‌లో విద్యార్థుల భారీ ఆందోళన
- సీబీఐ విచారణకు విద్యార్థుల డిమాండ్
- పోలీసులు లాఠీఛార్జ్, వాటర్ కెనాన్లు
Ranchi Assembly March: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (JSSC) నిర్వహించిన పోటీ పరీక్షల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి చేపట్టిన ఆందోళనలతో రాజధాని రాంచీ తీవ్రంగా ప్రకంపించింది. పరీక్షల లీకేజీలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి (Ranchi Assembly March)కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం విద్యార్థుల ప్రతినిధులతో జరిపిన మూడో విడత చర్చలు సైతం విఫలం కావడంతో, 8 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మహతో అంబులెన్స్‌లోనే అసెంబ్లీ మార్చ్‌లో పాల్గొనడం ఈ ఆందోళన తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది.
జేఎస్‌ఎస్‌సీ రద్దు, సీబీఐ విచారణే ప్రధాన డిమాండ్లు:
పోటీ పరీక్షల్లో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తున్న జార్ఖండ్ యువత ప్రధానంగా రెండు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. జేఎస్‌ఎస్‌సీ (JSSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్‌ను తక్షణమే రద్దు చేయాలని, అలాగే ఇటీవల జరిగిన అన్ని నియామక పరీక్షలపై స్వతంత్ర సీబీఐ విచారణకు ఆదేశించాలని పట్టుబట్టారు. 14వ జేపీఎస్‌సీ నియామక పరీక్షను రద్దు చేస్తామని ప్రభుత్వం ఆదివారం రోజునే హామీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, విద్యార్థులు మాత్రం సంతృప్తి చెందక ఆందోళనను కొనసాగించడానికే మొగ్గుచూపారు.
వాటర్ కెనాన్లు, లాఠీఛార్జ్ – ఉద్రిక్త వాతావరణం:
జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద భారీ సంఖ్యలో గుమిగూడిన విద్యార్థులు పోలీసు బారికేడ్లను తోసుకుంటూ అసెంబ్లీ దిశగా దూసుకెళ్లారు. తమను అడ్డుకునేందుకు నిర్మించిన బారికేడ్లను ఉద్దేశించి “ఇదేమైనా పాకిస్థాన్, బంగ్లాదేశ్ లేదా చైనా సరిహద్దా?” అని విద్యార్థి నేతలు పోలీసులను తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించడమే కాకుండా, వారిని చెదరగొట్టేందుకు ఓ దశలో లాఠీఛార్జ్ చేశారు. ఈ పోలీసు చర్యలతో రాంచీ అసెంబ్లీ పరిసర ప్రాంతాలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి.
