Kamal Haasan : తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. కమల్ హాసన్ సంచలన కామెంట్స్..

Kamal Haasan : విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ 108 సీట్లు గెలుచుకుంది. ఆయనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించకపోవడం తమిళనాడు ప్రజల తీర్పును అగౌరవపరచడమే అవుతుందని కమల్ హాసన్ పేర్కొన్నారు.

Kamal Haasan

Kamal Haasan : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న టీవీకే చీఫ్ విజయ్ కు మరోసారి చుక్కెదురైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గురువారం మరోసారి లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను విజయ్ కలిశారు. అయితే, విజయ్ విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించారు. 118మంది ఎమ్మెల్యేల మద్దతు వివరాలు ఇవ్వాలని, లేదంటే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇచ్చేది లేదని గవర్నర్ తేల్చి చెప్పినట్లు సమాచారం. తమ వద్ద ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల బలం ఉందని, అసెంబ్లీలో నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని, ఈ క్రమంలో ముందు ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని విజయ్ కోరినప్పటికీ.. గవర్నర్ విజయ్ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు తెలిసింది. తాజాగా పరిణామాలపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ (Kamal Haasan) ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు.

Also Read : Nara Lokesh : బుల్లెట్‌ బండిపై లోకేశ్‌! ఏపీకి ఎవరొస్తున్నారో తెలుసా..? అంటూ వీడియో రిలీజ్.. 3వేల మందికిపైగా ఉద్యోగ అవకాశాలు..

గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు. కమల్ హాసన్ ట్వీట్ ప్రకారం.. తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి కూడా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రజలు ఇవ్వలేదు. తమిళనాడు చరిత్రలో ఇది అపూర్వమైన ఫలితం. నా సోదరుడు ఎంకే స్టాలిన్.. మేము ప్రజల తీర్పును గౌరవిస్తాము. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ఆయన ప్రకటించారు. నేను ఆయన రాజకీయ పరిణతిని గౌరవిస్తాను. ప్రస్తుతం రాజ్యాంగ పదవులలో ఉన్నవారు ఇప్పుడు అదే కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఇది ఒక డిమాండ్ కాదు, వారి రాజ్యాంగ బాధ్యతను గుర్తుచేయడం మాత్రమే.

విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ 108 సీట్లు గెలుచుకుంది. ఆయనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించకపోవడం తమిళనాడు ప్రజల తీర్పును అగౌరవపరచడమే అవుతుంది. 233 మంది ఎన్నికైన సభ్యులు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఇది రాష్ట్రానికి అవమానం. ఇది ప్రజాస్వామ్యానికి నష్టం. ఎస్.ఆర్. బొమ్మై కేసులో, మెజారిటీని శాసనసభలో నిరూపించుకోవాలి రాజ్‌భవన్‌లో కాదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. నేను మాట్లాడుతున్నది పార్టీ రాజకీయాల గురించి కాదు. ఇది ఒక భారత పౌరుడి విధానపరమైన గళం. తమిళనాడు ప్రజల తీర్పును గౌరవించాలంటూ కమల్ హాసన్ పేర్కొన్నారు.