Karnataka Car Explosion : ప్రియురాలిపై కత్తితో దాడి.. క్షణాల్లో కారులో పేలుడు.. కర్ణాటకలో సంచలన ఘటన

Karnataka Car Explosion : కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ప్రయాణిస్తున్న కారులో ఓ యువతి మీద కత్తితో దాడి చేసిన 30ఏళ్ల యువకుడు, కొద్ది సేపటికే జరిగిన పేలుడులో సజీవదహనమయ్యాడు.

karnataka car explosion after woman stabbing

Karnataka Car Explosion : కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో శనివారం సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న కారులో ఓ యువతి మీద కత్తితో దాడి చేసిన 30ఏళ్ల యువకుడు, కొద్ది సేపటికే జరిగిన పేలుడులో సజీవదహనమయ్యాడు. ఈ ఘటనలో గాయపడిన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Also Read : Bhagirath Choudhary Subsidy : కేంద్ర మంత్రికి రూ.99 లక్షల సబ్సిడీ.. రాజకీయ దుమారం రేపిన పాలీహౌస్ వ్యవహారం.. అసలు విషయం చెప్పేశారు..

వివరాల్లోకి వెళితే.. మృతుడిని నాగేంద్ర (30)గా పోలీసులు గుర్తించారు. గాయపడిన యువతి ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన రమ్య ఉల్లాస్ (23). ఆమె బెంగళూరులోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఆమెకు తుమకూరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, నాగేంద్ర బెంగళూరులో ఓ కారును అద్దెకు తీసుకుని రమ్యతో కలిసి అంకోలా వైపు బయలుదేరాడు. కారును ప్రవీణ్ అనే డ్రైవర్ నడుపుతున్నాడు. తుమకూరు సమీపానికి చేరుకున్న తర్వాత నాగేంద్ర, రమ్య మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం సమయంలో నాగేంద్ర రమ్యపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన రమ్య వెంటనే కారులో బాంబు ఉందని డ్రైవర్‌కు హెచ్చరించింది. తీవ్ర గాయాలైనా ధైర్యం చేసి కారులో నుంచి బయటకు దూకింది. వెంటనే డ్రైవర్ కూడా కారును రోడ్డుపక్కన ఆపి బయటకు వచ్చాడు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రవీణ్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు.

డ్రైవర్, రమ్య బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే కారు ఒక్కసారిగా భారీ పేలుడుతో మంటల్లో చిక్కుకుంది. నాగేంద్ర కారులోనే తలుపులు వేసుకుని తానే తీసుకువచ్చిన దేశీయ తయారీ పేలుడు పదార్థాన్ని (క్రూడ్ బాంబు) పేల్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పేలుడుకు అసలు కారణం ఏమిటి? ఉపయోగించిన పేలుడు పదార్థం ఏది? అనే విషయాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు.

సమాచారం అందుకున్న తుమకూరు జిల్లా ఎస్పీ అశోక్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. యువకుడు ఎందుకు ఈ దాడికి పాల్పడ్డాడు? పేలుడు వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.