Karnataka Doctor Killed : ‘మహాతల్లి..’ భర్తను చంపేసి.. కొడుకుని పొడిచేసి.. పోలీసులు వచ్చేసరికి ఫోన్‌లో రీల్స్ చూస్తుంది..
Karnataka Doctor Killed : కర్ణాటక రాష్ట్రం ధారవాడ్ జయనగర్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 45ఏళ్ల అనస్థీషియా నిపుణుడు డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ కత్తిపోట్లతో మృతిచెందారు.
- Harish Thanniru
- Published on- July 16, 2026 / 12:11 PM IST
Dr Kiran Honannavar and wife Dr Priyanka
Karnataka Doctor Killed : కర్ణాటకలోని ధారవాడ్‌లో ప్రముఖ వైద్యుడు మృతి ఘటన సంచలనం రేపింది. అపార్టుమెంట్‌లో వైద్యుడు మృతిచెందగా.. అతని కుమారుడు తీవ్ర గాయాలతో పడిఉన్నాడు.. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, వైద్యుడి భార్య కింద పడుకొని తన సెల్‌ఫోన్ చూస్తుండటం చూసి స్థానికులు కంగుతిన్నారు.
ధారవాడ్ జయనగర్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 45ఏళ్ల అనస్థీషియా నిపుణుడు డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ కత్తిపోట్లతో మృతిచెందారు. అదే ఇంట్లో ఉన్న ఆయన ఎనిమిదేళ్ల కుమారుడు కూడా కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స కొనసాగుతోంది. అయితే, మృతుడి భార్య డాక్టర్ ప్రియాంక కూడా వైద్యురాలే. వైద్యుడి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా.. ఆమె నేలపై పడుకొని సెల్ ఫోన్ చూస్తున్నట్లు తెలిపారు.
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో భర్త, భార్య, కుమారుడు మాత్రమే ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. అయితే, అపార్ట్‌మెంట్ అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఉండటంతో బయటివారు లోపలికి వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు తెలిపారు. దీంతో డాక్టర్ ప్రియాంకను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఆమె వాంగ్మూలంలో స్పష్టత లేకపోవడంతో మరింత విచారణ కొనసాగుతోంది.
డాక్టర్ కిరణ్‌ను కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే, ఫోన్‌కు డాక్టర్ ప్రియాంకే స్పందిస్తూ.. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని పలుసార్లు.. ఆస్పత్రికి వెళ్లారని పలుసార్లు చెప్పినట్లు సమాచారం. సాయంత్రం వరకు డాక్టర్ కిరణ్ అందుబాటులోకి రాకపోవడంతో బంధువులు అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించారు. మరో గదిలో కుమారుడు తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని గుర్తించారు.
డాక్టర్ కిరణ్ కుటుంబ సభ్యులు డాక్టర్ ప్రియాంకపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. హత్యకు గల అసలు కారణం ఏమిటి, ఘటన ఎలా జరిగింది అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
