Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. పోలీసుల దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. ఎలా దొరికారంటే?
Wife Kills Husband : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురంలో జరిగిన భర్త హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని భావించిన భార్య, తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Extramarital affair wife murdered her husband with her lover In Nalgonda district
- ప్రియుడికోసం భర్తను హత్యచేసిన భార్య
- నల్గొండ జిల్లాలో దారుణ ఘటన
- పోలీసులు దర్యాప్తులో సంచలన ట్విస్ట్
Wife Kills Husband : నల్గొండ జిల్లాలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ఉదంతం తీవ్ర కలకలం రేపింది. అనుమానాస్పద మృతిగా నమోదైన కేసును పోలీసులు దర్యాప్తు చేసి అసలు నిజాలను వెలుగులోకి తెచ్చారు. సెల్ఫోన్ విషయంలో మొదలైన కుటుంబ కలహాలు చివరకు హత్యకు దారితీసినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురంలో జరిగిన భర్త హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని భావించిన భార్య, తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నర్సాపురం గ్రామానికి చెందిన ఇస్లావత్ గోవింద్ అలియాస్ గోన్యా (53) ఈ నెల 10న అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీనిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని సోదరుడు దూద్యా జూలై 11న వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గోవింద్ భార్య ఇస్లావత్ సరోజకు అదే గ్రామానికి చెందిన చెన్నబోయిన శ్రీనుతో గత ఆరేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దంపతుల కుమార్తెలకు వివాహాలు కావడంతో ఇంట్లో భార్యాభర్తలిద్దరే నివసిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సరోజ తన ప్రియుడితో తరచూ ఫోన్లో మాట్లాడుతుంది. భర్త గోవింద్ ఆమెను మందలించాడు. తరచూ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటూ ప్రశ్నించాడు. అయినా ఆమెలో మార్పురాకపోవడంతో సెల్ ఫోన్ను నేలకేసి కొట్టాడు. దీంతో దంపతుల మధ్య తీవ్ర గొడవలు ప్రారంభమయ్యాయి.
సెల్ ఫోన్ పగలగొట్టాడని భర్తపై కోపం పెంచుకున్న భార్య.. ప్రియుడితో కలిసి గోవింద్ ను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. ఈ క్రమంలో జూలై 10న సరోజ తన ప్రియుడు శ్రీనును ఇంటికి పిలిచింది. సరోజ భర్త గోవింద్ కాళ్లను గట్టిగా పట్టుకోగా, శ్రీను అతని ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశాడు. గోవింద్ ప్రతిఘటించడంతో సరోజ రోకలి బండతో దాడి చేసింది. దీంతో గోవింద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్య అనంతరం రక్తపు మరకలు ఉన్న దుస్తులు, సెల్ఫోన్లను దాచిపెట్టి ఇద్దరూ పరారయ్యారు. మృతుడి సోదరుడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా మంగళవారం దామరచర్ల శివారులోని రైల్వే గేటు సమీపంలోని చెట్ల పొదల్లో దాక్కున్న సరోజ, శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు.
