Kerala Result LDF : 50 ఏళ్ల తర్వాత ఇప్పుడే తొలిసారి.. దేశం నుంచి కనుమరుగయ్యే స్థితికి చేరుకున్న పార్టీ.. మరి భవిష్యత్తులో

Kerala Result LDF : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ ఆసక్తికర అంశాన్ని తెర మీదకు తెచ్చాయి.

kerala result 2026 Left parties With No Government In India For First Time In 50 Years

Kerala Result LDF : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీల గెలుపోటములతో పాటు మరో ఆసక్తికరమైన అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చాయి. తాజాగా వెల్లడైన ఫలితాల తర్వాత దేశంలో 50 ఏళ్ల తర్వాత తొలిసారి ఒక జాతీయ పార్టీ పూర్తిగా అధికారానికి దూరమయ్యింది. ఇంతకీ అది ఏ పార్టీ అంటే కమ్యూనిస్టు పార్టీ. సోమవారం మధ్యాహ్నం వెల్లడవుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రకారం.. పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) కేరళలో అధికారాన్ని కోల్పోతే.. 1970 తర్వాత భారతదేశంలో కమ్యూనిస్టులు ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేకపోవడం ఇదే మొదటిసారి అవుతుంది.

గొప్ప చరిత్ర

భారతదేశ రాజకీయాల్లో వామపక్షాలకు చాలా గొప్ప చరిత్ర ఉంది. 1951-52లో దేశంలో తొలిసారి పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పుడు, లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీలలో అత్యధిక స్థానాలు సాధించింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానే. ఆపై ఐదేళ్ల తర్వాత, 1957లో కేరళలో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వామపక్ష పార్టీలు సరికొత్త చరిత్ర సృష్టించాయి.

బెంగాల్‌లో సుదీర్ఘ పాలన

ఆ తర్వాత 20 ఏళ్లకు 1977లో పశ్చిమ బెంగాల్‌లో సీపీఐ(ఎం) విజయం సాధించడంతో.. ఒక రాష్ట్రంలో ఒక పార్టీ సుదీర్ఘకాలం నిరంతరాయంగా పాలించిన రికార్డు మొదలైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జ్యోతిబసు 23 ఏళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగారు. 2000లో బుద్ధదేవ్ భట్టాచార్యకు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత మరో 11 ఏళ్ల పాటు బెంగాల్‌ను వామపక్షాలు పాలించాయి.

కేరళ, త్రిపురలో పట్టు

కేరళలో అధికారం మారుతూ ఉన్నప్పటికీ.. ఇటు త్రిపురలో కూడా వామపక్షాలు సుదీర్ఘకాలం తిరుగులేని విజయాన్ని సాధించి అధికారంలో కొనసాగాయి. 1993లో త్రిపురలో అధికారంలోకి వచ్చిన సీపీఐ(ఎం), 60 స్థానాల అసెంబ్లీలో ఒంటరిగానే 44 స్థానాలను గెలుచుకుంది. 1998 వరకు దశరథ్ దేబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తర్వాత మాణిక్ సర్కార్ ఆ బాధ్యతలు చేపట్టి 20 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగారు.

2011 నుండి తీవ్ర పతనం

దేశ రాజకీయాల్లో వామపక్షాల పతనం ఎప్పుడో ప్రారంభమైనా.. 2011 నుండి అది తీవ్రతరమైంది. పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, సింగూర్ భూసేకరణలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ‘పరిబోర్తన్’ (మార్పు) నినాదంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 294 స్థానాల బెంగాల్ అసెంబ్లీలో.. వామపక్షాలు కేవలం 62 స్థానాలకు పరిమితమయ్యాయి.

త్రిపురలో గట్టి దెబ్బ

2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో దేశవ్యాప్తంగా కాషాయ పార్టీకి క్రమంగా మద్దతు పెరుగుతూ వస్తోంది. 2018లో లెఫ్ట్ ఫ్రంట్ కోట అయిన త్రిపురను బీజేపీ కైవసం చేసుకోవడంతో.. వామపక్షాలు పూర్తిగా తమ ఉనికి కోల్పోయే స్థితికి చేరుకున్నాయి. ఈ ఎన్నికల్లో 60 స్థానాల అసెంబ్లీలో బీజేపీ 36 స్థానాలను గెలుచుకోగా, కమ్యూనిస్టుల సంఖ్య 50 నుండి కేవలం 16కి పడిపోయింది.

కేరళ ఒక్కటే ఊరట

అయితే అప్పట్లో వామపక్షాలకు కేరళ ఒక్కటే ఊరటనిచ్చింది. 2016లో పినరయి విజయన్ నేతృత్వంలో అధికారంలోకి రావడమే కాకుండా, ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే కేరళ సంప్రదాయాన్ని కాదని.. తిరిగి 2021లో మళ్లీ విజయన్ విజయం సాధించారు.

కనుమరుగవుతున్న ఎర్రజెండా

అయితే, సోమవారం నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేరళలో కూడా వామపక్షాలు ఓటమి దిశగా వెళ్తున్నాయి. కేరళలోని 140 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) 83 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, వామపక్షాలు కేవలం 42 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నాయి. దీనితో లెఫ్ట్ కూటమి కేరళలో కూడా అధికారాన్ని కోల్పోయేలా కనిపిస్తోంది. ఇదే జరిగితే 50 ఏళ్ల తర్వాత దేశంలో తొలిసారి అన్ని రాష్ట్రాల్లో వామపక్షాలు అధికారాన్ని కోల్పోయినట్లు అవుతుంది. మరి భవిష్యత్తులో మళ్లీ ఇవి పుంజుకుని అధికారంలోకి వస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం అయితే భారతదేశంలో కమ్యూనిస్టులు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.