Kerala Twin Wedding : ఇదేందయ్యా ఇది..! కవల అబ్బాయిలకు కవల అమ్మాయిలతో పెళ్లి.. చేసింది కవల పాస్టర్లు.. ట్విస్ట్ మీద ట్విస్ట్.. వావ్..

Kerala twin wedding : కేరళలోని కొట్టాయం జిల్లా చంగనస్సేరి పట్టణంలో కవల జంటల వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది.

Kerala Twin Wedding

  • కేరళలోని కొట్టాయం జిల్లాలో విచిత్రమైన పెండ్లి
  • పెళ్లి చేసుకున్న జంటలు, చేసిన ఫాదర్లు కవలలే
  • వివాహంలో ట్విస్టులే ట్విస్టులు.. ఆశ్చర్యపోయిన స్థానికులు

Kerala Twin Wedding : కేరళలోని కొట్టాయం జిల్లా చంగనస్సేరి పట్టణంలో జరిగిన ఓ వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా పెళ్లిళ్లు అలంకరణలు, సంగీతం లేదంటే విందు భోజనాలతో గుర్తుండిపోతాయి. కానీ, ఈ పెళ్లి మాత్రం పూర్తిగా కవలల (Twins) చుట్టూనే సాగి అరుదైన వేడుకగా నిలిచింది. వరులు, వధువులు మాత్రమే కాదు.. వివాహ తంతు నిర్వహించిన ఫాదర్లు, ఆల్టర్ బాయ్స్ కూడా కవలలే కావడం విశేషం.

Also Read : Hari Teja : నువ్వే నా ప్ర‌పంచం.. నువ్వే నా ప్ర‌శాంత‌త‌.. కూతురితో హ‌రితేజ‌.. క్యూట్ ఫోటోలు

కొట్టాయం జిల్లాలోని చంగనస్సేరి మెట్రోపాలిటన్ చర్చిలో గురువారం ఈ వివాహం ఘనంగా జరిగింది. కవల సోదరులు అఖిల్ కె. థామస్, నిఖిల్ కె. థామస్.. కవల సోదరీమణులు మాగీ మేరీ థామస్, మారియా మేరీ థామస్‌లను వివాహం చేసుకున్నారు. వివాహ వేడుకలో అఖిల్.. మాగీ చేయి పట్టుకుని నిలబడగా, అతని పక్కనే నిఖిల్ తనకు కాబోయే భార్య మారియాతో కలిసి నిలబడ్డాడు. ఈ దృశ్యం అక్కడికి వచ్చిన అతిథులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. వీరి వివాహం జరిపించిన చర్చి ఫాదర్లు ‌కూడా కవలలే. కంజిరప్పల్లి డయాసిస్‌కు చెందిన కవలలైన ఫాదర్ ఆంటో పెజుమ్‌కట్టిల్, ఫాదర్ అజో పెజుమ్‌కట్టిల్ లు రెండు జంటలకు వివాహం జరిపించారు.

ఈ వివాహంలో మరో ట్విస్ట్ ఉంది.. రెండు జంటలు, వివాహం జరిపిన ఫాదర్లు కవలలు కావటం విశేషం అయితే.. వీరికి సహాయకులుగా పాలాకు చెందిన కవల సోదరులు జెరాన్ జేమ్స్, జోహన్ జేమ్స్ ఆల్టర్ బాయ్స్‌గా సేవలందించారు. దీంతో పెళ్లిలో ప్రతి కీలక బాధ్యతను కవలలే నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. దీంతో ఈ పెండ్లి స్థానికంగా, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.

వరులు అఖిల్, నిఖిల్‌లు చంగనస్సేరికి చెందిన కుంజుమోన్ థామస్, జోమోల్ దంపతుల కుమారులు. వధువులు మాగి, మారియా పథనంతిట్ట జిల్లాలోని కులత్తూర్‌కు చెందిన టోమిచన్, మేరీకుట్టి దంపతుల కుమార్తెలు. తమ చిన్ననాటి నుంచే కవలలతోనే పెళ్లి జరగాలని, పెండ్లి జరిపించే వారు కూడా కవలలే అయ్యి ఉండాలని కలగన్నామని మాగి, మారియా తెలిపారు. తమ కుటుంబ సభ్యుల కోరిక కూడా అదే అని చెప్పారు. ఈ కలను నిజం చేసేందుకు ప్రత్యేకంగా కవల ఫాదర్లను వెతికామని వెల్లడించారు. చివరకు కవలల సమావేశాలకు ప్రసిద్ధి చెందిన కొతనల్లూర్ చర్చి ద్వారా ఆ ఫాదర్లను సంప్రదించామని తెలిపారు. ఆహ్వానం అందుకున్న వెంటనే వారు అంగీకరించి రావడం తమ అదృష్టమని చెప్పారు.

అఖిల్, నిఖిల్ ఇద్దరూ మర్చంట్ నేవీలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరోవైపు మాగి, మారియా ఇద్దరూ ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. వృత్తిపరంగా వేర్వేరు మార్గాల్లో ప్రయాణించిన ఈ నలుగురు.. ఇప్పుడు జీవితంలో కొత్త అధ్యాయాన్ని కలిసి ప్రారంభించారు. ఈ అరుదైన వివాహ వేడుకకు హాజరైన అతిథులు కూడా ఇది తమ జీవితంలో చూసిన అత్యంత ప్రత్యేకమైన పెళ్లిళ్లలో ఒకటిగా అభివర్ణించారు. కుటుంబ సభ్యులకు మాత్రం ఇది చిన్ననాటి కల సాకారమైన ఆనంద క్షణంగా నిలిచిపోయింది.