Ketan Agarwal Case : ప్రీవెడ్డింగ్ మర్డర్ ఇష్యూ.. కేతన్ అగర్వాల్ ఇంట్లో మరో విషాదం..
Ketan Agarwal Grandfather Devichand Agarwal Passes Away : కేతన్ అగర్వాల్ మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన తాతయ్య దేవీచంద్ అగర్వాల్ శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.
- Harish Thanniru
- Published on- July 5, 2026 / 01:56 PM IST
Ketan Agarwal Grandfather Devichand Agarwal Passes Away
Ketan Agarwal Grandfather Devichand Agarwal Passes Away : మహారాష్ట్రంలోని పూణెలో కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడితో కలిసి కేతన్‌ను హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది.. ఈ క్రమంలో కేతన్ అగర్వాల్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది.
కేతన్ అగర్వాల్ మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన తాతయ్య దేవీచంద్ అగర్వాల్ శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో అగర్వాల్ కుటుంబంలో మరోసారి విషాద చాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 71ఏళ్ల దేవీచంద్ అగర్వాల్ తన మనవడు కేతన్ మృతి చెందినప్పటి నుంచి తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో చికిత్స పొందుతున్నాడు. చివరికి రాత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.
దేవీచంద్ అగర్వాల్ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సక్సెస్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ గా గుర్తింపు పొందారు. చిన్న కిరాణా దుకాణంతో వ్యాపార జీవితాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం పుణెలో సక్సెస్ గ్రూప్ ను స్థాపించి పారిశ్రామిక, నివాస, వాణిజ్య రంగాల్లో సంస్థను విస్తరించారు. కొద్దిరోజుల క్రితమే కేతన్ అగర్వాల్ కు న్యాయం చేయాలని నిర్వహించిన క్యాండిల్ మార్చ్ లో దేవీచంద్ అగర్వాల్ పాల్గొన్నారు. మేము నమ్మిన వారే మమ్మల్ని మోసం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడాలి అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
కేతన్ అగర్వాల్ జూన్ 18న పుణె సమీపంలోని లోహగడ్ కోట వద్ద లోయలో పడిపోయి మృతి చెందాడు. తొలుత ప్రమాదంగా భావించినా ఈ ఘటనపై విచారణ జరపగా, అతనికి కాబోయే భార్య సియా గోయల్ , ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఇద్దరూ పోలీసు కస్టడీలో ఉండగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
