Chandrayaan 3 : చంద్రయాన్-3 కీలక ఘట్టం పూర్తి.. విజయవంతంగా విడిపోయిన ల్యాండర్ మాడ్యూల్..
చంద్రయాన్ -3 ప్రయోగంలో కీలక ఘట్టం విజయవంతం అయిందని ఇస్రో ట్విటర్ ద్వారా తెలిపింది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన తరువాత ‘థ్యాంక్స్ ఫర్ ది రైడ్, మేట్’ అని ల్యాండర్ మెసేజ్ పంపినట్లు ఇస్రో ట్వీట్ లో పేర్కొంది.
- Harish Thanniru
- Updated on- August 17, 2023 / 02:36 PM IST
Chandrayaan-3 Mission
Chandrayaan 3 Mission: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుడిపైకి ప్రవేశపెట్టిన చంద్రయాన్-3 ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కీలక ఘట్టాన్ని సమర్థవంతంగా పూర్తిచేసింది. గురువారం ఈ వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్ విజయవంతంగా విడిపోయింది. ఫలితంగా చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యే చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమైంది. చంద్రయాన్ -3 ప్రయోగంలో కీలక ఘట్టం విజయవంతం అయిందని ఇస్రో ట్విటర్ ద్వారా తెలిపింది. అయితే, ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన తరువాత ‘థ్యాంక్స్ ఫర్ ది రైడ్, మేట్’ అని ల్యాండర్ మెసేజ్ పంపినట్లు ఇస్రో ట్వీట్ లో పేర్కొంది.
ఒక్కో కక్ష్యను దాటుకుంటూ ఇస్రో అంచనాలకు అనుగుణంగా చంద్రయాన్-3 దూసుకెళ్తోంది. బుధవారం ఉదయం 8.30 గంటలకు చంద్రయాన్ -3 నాలుగోసారి కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఇస్రో విజయవంతంగా పూర్తిచేసింది. ఫలితంగా చంద్రయాన్-3 చంద్రుడికి 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది. గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్ విజయవంతంగా విడిపోయింది. ఈ ప్రక్రియ పూర్తికావడంతో ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి చుట్టూ సొంతంగా తిరుగుతుంది. శుక్రవారం సాయంత్రం డీ-ఆర్బిట్-1 ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. 20న మరోసారి డీ-ఆర్బిట్-2 ప్రక్రియను ఇస్రో చేపడుతుంది. ఆ తరువాత ఈనెల 23న సాయంత్రం 5.47 గంటల సమయంలో ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది.
చంద్రయాన్-3 ప్రయోగాన్ని జులై14న ఇస్రో శ్రీహరి కోట నుంచి విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. చంద్రయాన్-3లో భాగమైన విక్రమ్ (ల్యాండర్), ప్రగ్యాన్ (రోవర్) చంద్రుడిపై ల్యాండ్ కానున్నాయి. ఇందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తేదీని 23గా వెల్లడించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 ఈనెల 23న సాయంత్రం సక్సెస్ఫుల్గా అడుగుపెడుతుంది.
