MK Stalin: పని చేయడానికా.. సముద్రాన్ని చూస్తూ కూర్చోడానికా.. సీఎం విజయ్ పై డీఎంకే అధినేత తీవ్ర విమర్శలు
తమిళనాడు ప్రభుత్వం(MK Stalin) నూతన సచివాలయం నిర్మించేందుకు సన్నాహాలు చేయడంపై రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
- V Santhosh Kumar
- Published on- September 21, 2026 / 03:46 PM IST
M.K. Stalin made sensational comments regarding new Tamil Nadu Secretariat
MK Stalin: తమిళనాడు ప్రభుత్వం చెన్నై పట్టినపాక్కంలోని శీనివాసపురం వద్ద నూతన సచివాలయం నిర్మించేందుకు సన్నాహాలు చేయడంపై రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరీనా బీచ్ పరిసరాల్లో, మత్స్యకారుల ఆవాస ప్రాంతాల్లో ప్రభుత్వం మొండిగా నూతన సచివాలయ నిర్మాణానికి పూనుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సచివాలయం అనేది పాలన సాగించి ప్రజలకు సేవలు అందించడానికి తప్ప, ముఖ్యమంత్రి సముద్రాన్ని చూస్తూ కూర్చోవడానికి కాదని ఎద్దేవా చేశారు. పట్టినపాక్కంలో సెక్రటేరియట్ నిర్మాణ జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో స్థానిక మత్స్యకార సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
మత్స్యకారుల ఆందోళన.. జీవనోపాధి దెబ్బతింటుందని భయం:
ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణ జీవో విడుదల చేయడంతో తీరప్రాంత మత్స్యకార గ్రామాలైన శీనివాసపురం, ముళ్లికుప్పం, నంబిక్కై నగర్, నొచ్చికుప్పం తదితర గ్రామాల ప్రజలు తీవ్ర నిరసనలు తెలిపారు. సచివాలయం నిర్మిస్తే తరతరాలుగా వస్తున్న తమ మనుగడ, జీవనోపాధి దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్యకారుల జీవనోపాధిని నాశనం చేసే ప్రాజెక్టులను వెంటనే నిలిపివేసి, అదే ప్రాంతంలో స్థానిక జాలర్లకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు.
విస్తరిస్తున్న నిరసనలు.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సన్నాహాలు:
చెన్నై తీరప్రాంతాల్లో మత్స్యకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పర్యావరణ వ్యవస్థను, స్థానిక మత్స్యకారులను ఇబ్బందులకు గురిచేసి నిర్మించే నూతన సచివాలయ ప్రతిపాదనను ఉపసంహరించుకునే వరకు ఈ నిరసన సెగలు తగ్గేలా కనిపించడం లేదు.
