Karur Stampede : సీఎం విజయ్‌కి ఫస్ట్ షాక్..! ఆ ఆర్డర్స్ చెల్లవన్న మద్రాస్ హైకోర్టు
CM Vijay-Madras High Court : తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వానికి తొలి ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ (Karur Stampede) తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల ఉత్తర్వును మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది.
- Sreehari A
- Updated on- July 27, 2026 / 06:53 PM IST
Karur Stampede
- మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెల్లడి
- కరూర్ తొక్కిసలాట బాధితులకు ఉద్యోగ ఉత్తర్వు రద్దు
- విజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు
CM Vijay-Madras High Court : మద్రాస్ హైకోర్టులో విజయ్ ప్రభుత్వానికి ఫస్ట్ షాక్ తగిలింది. కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును కోర్టు రద్దు చేసింది.
ప్రభుత్వ నియామకాలను సవాలు చేస్తూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను కూడా కొట్టివేసింది. తొక్కిసలాట (Karur Stampede) ఘటనపై సీబీఐ ఇంకా దర్యాప్తు చేస్తోందని, సుప్రీంకోర్టు ఈ విచారణను పర్యవేక్షిస్తోందని కోర్టు పేర్కొంది.
ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని తెలిపింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలని అక్షింతలు వేసింది. ప్రభుత్వ చర్యలపై నియంత్రణ ఉండాలని సూచించింది. లేదంటే అరాచకం, అశాంతి రాజ్యమేలుతాయని హెచ్చరించింది.
‘ప్రభుత్వ ఉద్యోగాన్ని ఉచితంగా పంచిపెట్టేది కాదని కష్టపడి సాధించాలని, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతోమంది ఆశగా ఎదురుచూస్తున్నారని ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
కరూర్‌లో సీఎం విజయ్ తొలి పర్యటన :
పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం విజయ్ జూలై 10న కరూర్‌లో తొలిసారి పర్యటించారు. ఈ పర్యటనతో పాటు 2025 సెప్టెంబర్‌లో టీవీకే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ బాధితుల కుటుంబాల కోసం భారీ పునరావాస కార్యక్రమాన్ని కూడా ఆయన చేపట్టారు. ఈ పర్యటన సందర్భంగా సీఎం విజయ్ మృతులకు సంబంధించిన 32 కుటుంబాల సభ్యులకు కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ నియామక పత్రాలను అందజేశారు.
రాష్ట్ర పునరావాస ప్యాకేజీలో భాగంగా బాధితులైన ప్రతి కుటుంబం నుంచి అర్హత గల ఒక సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం లభించింది. జిల్లాలో బహిరంగ సభలో ప్రసంగానికి ముందు సీఎం విజయ్ జిల్లా కలెక్టరేట్ వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించారు.
