Udhayanidhi Stalin: నటి త్రిషపై వ్యాఖ్యల కేసు.. ఉదయనిధి స్టాలిన్ విడుదల.. హైకోర్టు కీలక ఉత్తర్వులు
నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin)కు మద్రాస్ హైకోర్టు సంచలన ఉత్తర్వులతో ఉపశమనం లభించింది.
- V Santhosh Kumar
- Published on- August 4, 2026 / 10:47 PM IST
madras high court grants bail to dmk mla udhayanidhi stalin in trisha comments case
- ఉదయనిధి స్టాలిన్ విడుదల
- హైకోర్టు కీలక ఉత్తర్వులు
- సీఎం విజయ్‌పై విమర్శలు
Udhayanidhi Stalin: నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్టయిన తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టు సంచలన ఉత్తర్వులతో ఉపశమనం లభించింది. తంజావూరులో జరిగిన కావేరి జలాల సభలో చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసు ఆధారంగా నీలాంకారైలో మంగళవారం ఉదయం విజయ్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. అయితే, హైకోర్టు ఆదేశాల ప్రకారం పోలీసుల విచారణ ముగిసిన వెంటనే సాయంత్రం ఆయన విడుదలయ్యారు.
పోలీసు విచారణ పూర్తి – మద్రాస్ హైకోర్టు ఆదేశాలు:
అరెస్టు తర్వాత డీఎంకే న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించగా, ఉదయనిధిని కేవలం ప్రశ్నించడానికే అదుపులోకి తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో సెంగిపట్టి పోలీస్ స్టేషన్‌లో దాదాపు గంటన్నర పాటు విచారణ ముగిసిన వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. విడుదల అనంతరం స్టేషన్ వెలుపల భారీగా వేచి ఉన్న అభిమానులకు ఉదయనిధి అభివాదం చేశారు.
విజయ్ ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం:
ఈ అరెస్టు పరిణామంపై ఉదయనిధి(Udhayanidhi Stalin) తండ్రి, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అహంకారం ఎప్పుడైనా వినాశనానికే దారితీస్తుందంటూ టీవీకే అధినేత, సీఎం విజయ్‌తో పాటు బీజేపీని తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాకుండా విజయ్‌ను ‘రీల్స్ సీఎం’ అని అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
