హత్రాస్ ఘటన బాధిత కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకురాలు Priyanka Gandhi వాద్రాను ఓ పోలీసు చేయి పట్టుకుని నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె దుస్తులను పట్టుకున్నారు కూడా. దీనిపై భాజపా మహిళా నేత ఒకరు తీవ్రంగా మండిపడ్డారు.
‘మహిళా నాయకురాలి దుస్తులపై చేయి వేయడానికి ఆ పోలీసు అధికారికి ఎంత ధైర్యం?’ అని మహారాష్ట్ర భాజపా ఉపాధ్యక్షురాలు చిత్రా కిషోర్ వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి వెళ్లిన కాంగ్రెస్ ప్రతినిధులను గ్రేటర్ నోయిడా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
ఆ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్న నేపథ్యంలో కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కార్యకర్తలకు దెబ్బలు తగలకుండా ప్రియాంక గాంధీ ప్రయత్నించారు.
అదే సమయంలో ఓ అధికారి ప్రియాంక చేయి పట్టుకుని బలవంతంగా నిలువరించే ప్రయత్నం చేశారు. ఇదే తీవ్ర దుమారానికి దారితీసింది. మహిళా నాయకురాలితో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాజాగా బీజేపీ మహిళా నాయకురాలు చిత్రా వాగ్ కూడా తీవ్రంగా ఖండించారు. ‘మహిళా నాయకురాలి దుస్తులపై చేయి వేయడానికి మగ పోలీసుకు ఎంత ధైర్యం?’ అని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనిపై తీవ్రంగా స్పందించాలని, సదరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఈ ఘటనపై స్పందించిన యూపీ గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసులు ప్రియాంక గాంధీకి క్షమాపణలు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.