Amravati : రాత్రివేళల్లో గజ్జెల శబ్దాలు.. నవ్వులు, ఏడుపులు! ‘దెయ్యం’ భయంతో హాస్టల్ నుంచి వెళ్లిపోయిన విద్యార్థులు.. చివరిలో ట్విస్ట్..
Ghost scare in Hostel : మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో వింత ఘటన కలకలం రేపింది.
- Harish Thanniru
- Updated on- August 14, 2026 / 12:49 PM IST
Ghost scare in Hostel : మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో వింత ఘటన కలకలం రేపింది. హాస్టల్‌లో గజ్జెల శబ్దాలు, నవ్వులు, ఏడుపులు వినిపిస్తున్నాయంటూ కొందరు విద్యార్థినులు చెప్పడంతో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ విషయం క్రమంగా హాస్టల్ మొత్తం వ్యాపించడంతో.. ఏకంగా 608 మంది విద్యార్థులు భయంతో ఇళ్లకు వెళ్లిపోయారు.
Also Read : Suryapet : సూర్యాపేట భార్యాభర్తల హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఇద్దరు కానిస్టేబుళ్లు.. అసలు విషయం ఇదే..
అమరావతి జిల్లా మెల్‌ఘాట్ ప్రాంతంలోని డోమా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో మొత్తం 608 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 263 మంది బాలురు, 345 మంది బాలికలు ఉన్నారు. వీరంతా హాస్టల్‌ను విడిచి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. కొందరు విద్యార్థినులు రాత్రివేళల్లో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. గజ్జెలు మోగినట్లు, ఎవరో నవ్వుతున్నట్లు, ఏడుస్తున్నట్లు శబ్దాలు వినిపించాయని వారు చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో హాస్టల్‌లో విద్యార్థులు, విద్యార్థినులు భయాందోళనకు గురై హాస్టల్ విడిచివెళ్లిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఫిర్యాదులు చేసిన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లి మానసిక వైద్య నిపుణులతో పరీక్షలు చేయించారు. కొందరిలో తీవ్రమైన హిస్టీరియా వంటి లక్షణాలు ఉండొచ్చని వైద్యులు సూచించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజయ్ చౌదరి తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తూ వారి భయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. వైద్యాధికారి మాట్లాడుతూ.. ఇది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితి కావచ్చని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని తొలగించేందుకు పాఠశాల యాజమాన్యం, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడి అవగాహన కల్పించారు. విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
