Date Of Birth On Wedding Cards: పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి.. ప్రభుత్వం సరికొత్త ప్లాన్

పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను (Date Of Birth On Wedding Cards) తప్పనిసరిగా ముద్రించేలా సరికొత్త నిబంధనను తీసుకురావాలని యోచిస్తోంది.

Maharashtra govt planning to mandatory to print dates of birth of the bride and groom on wedding invitations

  • బాల్యవివాహాల అదుపునకు సరికొత్త వ్యూహం.
  • పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీలు.
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.

Date Of Birth On Wedding Cards: మహారాష్ట్ర ప్రభుత్వం బాల్యవివాహాలను అరికట్టడానికి ఒక వినూత్నమైన, సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకోనుంది. పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను (Date Of Birth On Wedding Cards) తప్పనిసరిగా ముద్రించేలా సరికొత్త నిబంధనను తీసుకురావాలని యోచిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అదితి తట్కరే ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో బాల్యవివాహాల రేటును 10 శాతం కంటే కిందకు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్లాన్ సిద్ధం చేస్తోంది.

రాజస్థాన్ తరహా విధానం – క్షేత్రస్థాయి పరిశీలన:

ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రంలో పెళ్లి కార్డులపై పుట్టిన తేదీలను ముద్రించే పద్ధతి అమలులో ఉంది. ఈ విధానం ఎంతవరకు విజయవంతమైందో, దీని సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ రాజస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. గ్రామీణాభివృద్ధి, న్యాయ శాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ విధానాన్ని మహారాష్ట్రలో కూడా ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల పెళ్లికి వచ్చే బంధువులతో పాటు పోలీసులకు కూడా వధూవరుల అసలు వయస్సు తెలిసిపోతుందని, ఒకవేళ వారు మైనర్లు అయితే వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

కఠిన చర్యలు, ప్రత్యామ్నాయ సూచనలు:

బాల్యవివాహాలను అడ్డుకోవడానికి కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్, గ్రామ రక్షణ కమిటీలను మరింత బలోపేతం చేస్తున్నారు. కేవలం తల్లిదండ్రులపైనే కాకుండా, బాల్యవివాహాలు అని తెలిసి కూడా పెళ్లి జరిపించే పూజారులు, వాయించే బ్యాండ్ మేళం సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అయితే, ఈ నిర్ణయంపై కొంత విమర్శ కూడా వ్యక్తమైంది. మహారాష్ట్ర సామాజిక సంస్కరణలకు నిలయమని, ఇతర రాష్ట్రాల పద్ధతులను అనుకరించడం కంటే.. ప్రజల్లో అవగాహన పెంచడం, డాక్యుమెంటరీలు, సినిమాల ద్వారా చైతన్యం తీసుకురావడం వంటి సామాజిక మార్గాలను ఎంచుకుంటే బాగుంటుందని స్వతంత్ర ఎమ్మెల్యే సత్యజీత్ తాంబే అభిప్రాయపడ్డారు.