TET Paper Leak : టెట్ పేపర్ లీక్.. పరీక్ష వాయిదా వేసిన ప్రభుత్వం.. ఆందోళనలో అభ్యర్థులు
TET Paper Leak : నీట్ పేపర్ లీక్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో టెట్ పేపర్ లీకైంది.
- Harish Thanniru
- Updated on- June 27, 2026 / 04:43 PM IST
Maharashtra TET Paper Leak Government postpones exam
TET Paper Leaked : నీట్ పేపర్ లీక్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పేపర్ లీక్ వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపింది. అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. మరోవైపు.. పరీక్ష వాయిదా.. మళ్లీ నిర్వహించడంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారం మరవకముందే మరో పేపర్ లీక్ ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో టెట్ పేపర్ లీకైంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమై టెట్ పరీక్షను వాయిదా వేసింది. ఈ మేరకు మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్లడించింది.
Also Read : Amaravati: అమరావతిలో హైటెన్షన్.. వైసీపీ బృందంపై కోడిగుడ్లు, రాళ్ల దాడి.. ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు
మహారాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం (జూన్ 28) నిర్వహించాల్సి ఉంది. సుమారు 4.28 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. అధికారులు ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. పేపర్ 1 ఉదయం 10.30 గంటల నుంచి పేపర్2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించేందుకు అధికారులు సర్వంసిద్ధం చేశారు. అభ్యర్థులుసైతం తమకు కేటాయించిన సెంటర్లకు వెళ్లి పరీక్షలు రాసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో టెట్ పేపర్ లీక్ ఘటన వారిని ఆందోళనకు గురిచేసింది.
ముంబై సమీపంలోని థానే జిల్లా భీవండి ప్రాంతంలో టెట్ పేపర్ లీకైనట్లు శనివారం అధికారులు గుర్తించారు. వెంటనే పరీక్షను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి పరీక్ష తేదీ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మహారాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, అదనపు పరీక్షా ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. కొత్త తేదీ ప్రకటించిన తర్వాత తాజా హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
టెట్ పేపర్ లీక్ ఘటనపై ప్రాథమిక విచారణ పూర్తయిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మెటీరియల్ అసలైన టెట్ ప్రశ్నాపత్రమా..? లేదంటే మాక్ టెస్ట్ పేపరా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. టెట్ పేపర్ లీక్ ఘటనపై పోలీసులు పలు చోట్లు సోదాలు నిర్వహించగా.. భీవండి ప్రాంతంలో పేపర్ లీక్ అయినట్లు ఎగ్జామినేషన్ కౌన్సిల్ వెల్లడించింది.
నిందితులను పట్టుకున్నాం : అశోక్ ధుధే
మహారాష్ట్రలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ప్రశ్నపత్రం లీక్ కేసుపై థానే అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ దుధే కీలక వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం టెట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని అమ్మడానికి కొంతమంది వ్యక్తులు భివండి నగరంలోని కొంగావ్ ప్రాంతానికి వస్తున్నారని ఒక రహస్య వ్యక్తి నుంచి డీసీపీ (జోన్ 2) పవన్ బన్సోద్‌కు సమాచారం అందింది. ఆయన ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ఎవరికీ అనుమానం రాకుండా కొంతమందిని పేపర్ కొనుగోలు చేసేందుకు నియమించారు. వారిద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఉదయం 11గంటలకు ప్రశ్నపత్రాన్ని విక్రయించడానికి ముగ్గురు వ్యక్తులు వచ్చారని పోలీస్ బృందానికి సమాచారం వచ్చింది.
ప్రాథమిక సంభాషణ అనంతరం వారిని సోదా చేయగా.. వారి వద్ద టెట్ పరీక్షకు సంబంధించిన అసలైన ప్రశ్నాపత్రాలను పోలీసు బృందం స్వాధీనం చేసుకుందని తెలిపారు. విద్యాశాఖలోని ఉన్నతాధికారులను సంప్రదించగా.. ఇవి సరైన పత్రాలేనని వారు ధృవీకరించారు. ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకొని, ప్రశ్నాపత్రాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
నిందితుల వద్ద మొబైల్ ఫోన్లు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను కూడా స్వాధీనం చేసుకోవటం జరిగిందని థానే అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ దుధే తెలిపారు. ఈ ఆపరేషన్ లో ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారు ఢిల్లీ నుంచి ఇక్కడికి ప్రయాణించి వచ్చారని, నిందితుల్లో ఒకరు హర్యానాకు చెందిన వారుకాగా.. మిగిలిన ఇద్దరు నిందితులు బీహార్ రాష్ట్రంకు చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. వీరితోపాటు మరికొంతమంది పేపర్ లీక్ ఘటనలో ఉన్నారని వారి కోసం ఆరా తీస్తున్నట్లు చెప్పారు.
#WATCH | Bhiwandi, Maharashtra | On Teacher Eligibility Test in Maharashtra postponed after paper leak, Thane Additional Commissioner Ashok Dudhe says, “… This morning, DCP (Zone 2) Pawan Bansod received a tip-off from a confidential informant that certain individuals were… pic.twitter.com/SGUvamMuwp
— ANI (@ANI) June 27, 2026
