వందల మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా
- Subhan Ali Shaik
- Published On : March 10, 2021 / 01:54 PM IST
Mahindra Termination
Mahindra and Mahindra: వందలమంది ఎగ్జిక్యూటివ్ స్థాయి వ్యక్తులకు దేశీయ ఆటో మేకింగ్ దిగ్గజ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా భారీ షాక్ ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్ స్థాయి వ్యక్తులను 300 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించాలని నిర్ణయించింది. దీనంతటికీ కరోనావైరస్ మహమ్మారి సంక్షోభమే కారణం. మహీంద్రా మొబిలిటీ సర్వీసెస్ అధ్యక్షుడు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ వీఎస్ పార్థసారధి సహా పలువురు సీనియర్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌లు ఇందులో ఉన్నారు.
మహీంద్రా ప్లానింగ్ కమిటీ ఆఫీసర్ ప్రహ్లాద రావు, ఇతర సీనియర్ స్థాయి అధికారులు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వార్తలపై ఎంఅండ్‌ఎం ఎటువంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. వాహనాల విక్రయాలు మందకొడిగా జరుగుతుండటంతో మహీంద్రా ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమలో మందగమనానికి తోడు కరోనా వైరస్, లాక్‌డౌన్ ప్రభావం తీవ్రంగా పడింది.
పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా ప్రస్తుతానికి ఆటో, వ్యవసాయ విభాగానికి మాత్రమే పరిమితమైన ఈ కోతలు మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి కూడా పాకుతుందనే అనుమానం నెలకొంది. మహీంద్రా ఆటోమోటివ్ విభాగం ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఇప్పటి వరకు అమ్మకాలలో 27.52 శాతం క్షీణించింది. పరిశ్రమల పరిమాణం 13.2 శాతం తగ్గింది. ఫిబ్రవరిలో ప్రయాణీకుల వాహన రిటైల్ అమ్మకాలు 10.6శాతం పెరగ్గా, టూ వీలర్స్ సేల్ 16.08 శాతం తగ్గాయి.
