Supreme Court : భార్య వంట చేయడం లేదు.. విడాకులు ఇప్పించండన్న వ్యక్తి.. దిమ్మ తిరిగే షాకిచ్చిన సుప్రీంకోర్టు

Supreme Court : తన భార్య వంట చేయడంలేదని.. ఈ కారణంతో తనకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించిన వ్యక్తికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది.

man seeking divorce over household chores Supreme Court said Wife is not a maid

Supreme Court : భార్య అంటే కట్నం తీసుకుని వచ్చే పనిమనిషిగా భావించేవారు మన సమాజంలో నేటికీ ఉన్నారు. ఇంటి పని అంటే కేవలం ఆడవారిది మాత్రమే.. కోడలంటే మనింటికి వచ్చే పనిమనిషి అని భావించే మగవాళ్లు, అత్తింటివారు ఎందరో. అలాంటి వారిని ఉద్దేశించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకునేది జీవిత భాగస్వామిని.. ఫ్రీగా వచ్చే పనిమనిషిని కాదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటి పని అంటే కేవలం ఆడవారికి మాత్రమే నిర్దేశించింది కాదని.. మగవారికి, అందునా భర్తకు కూడా సమాన భాగస్వామ్యం ఉంటుందని వ్యాఖ్యానించింది.

భార్య నుంచి విడాకులు కోరుతూ కర్ణాటక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తన భార్య సరిగా వంట చేయకుండా క్రూరత్వానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ.. విడాకులు కోరిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో తొలుత ట్రయల్ కోర్టు.. అతడి వాదనతో ఏకీభవిస్తూ.. భార్య ‘క్రూరత్వానికి’ పాల్పడుతుండడంతో విడాకులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే కర్ణాటక హైకోర్టు దీన్ని పక్కన పెట్టింది. దాంతో ఆయన సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు.

ఈ క్రమంలో భర్త తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సదరు జంటకు 2017లో వివాహం జరగ్గా.. 2019 నుంచి వారు విడివిడిగా జీవిస్తున్నారని కోర్టుకు తెలిపారు. వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పలువురు మధ్యవర్తిత్వం జరిపినా లాభం లేకుండా పోయిందన్నారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు.. ‘క్రూరత్వం’ కారణం కింద ఈ జంటకు విడాకులు మంజూరు చేసిందని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ‘క్రూరత్వం’ అంటే ఏమిటని ప్రశ్నించింది. అందుకు అతడు భార్య ప్రవర్తన సరిగ్గా లేదని, వంట చేయడం లేదని తెలిపారు. దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్ స్పందిస్తూ.. ‘‘ఇంటి పనులను భర్త కూడా పంచుకోవాలి. ప్రస్తుతం రోజులు మారాయి. ఇప్పుడు అంట్లు తోమడం, వంట చేయడం, బట్టలు ఉతకడం ఇలా ఇంటి పనులన్నింటినీ భర్త కూడా చేయాలి’’ అని అన్నారు. జస్టిస్ మెహతా స్పందిస్తూ.. ‘‘వివాహం చేసుకున్నది పనిమనిషిని కాదు.. జీవిత భాగస్వామిని’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వంట చేయకపోవడం క్రూరత్వం కిందకు రాదని భావించిన కర్ణాటక హైకోర్టు సరైన నిర్ణయం తీసుకుందని.. అందుకే ఈ జంటకు విడాకులు మంజూరు చేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టిందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్నారని చెప్పడంతో వారిని ప్రత్యక్షంగా కోర్టులో ప్రవేశపెట్టాలని కోర్టు ఆదేశించింది.