Mobile Tower Theft : అదృశ్యమైన 40 మీటర్ల మొబైల్ టవర్.. బీహార్‌లో షాకింగ్ మిస్టరీ!

Mobile Tower Theft : దుమ్రావ్ ఎస్‌డీపీవో పొలస్త్ కుమార్ మాట్లాడుతూ.. టవర్ అదృశ్యమైన ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

mobile tower theft

Mobile Tower Theft : బీహార్ రాష్ట్రంలో బక్సర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దుమ్రావ్ పట్టణంలో ఉన్న 40 మీటర్ల ఎత్తయిన మొబైల్ టవర్ ఒక్కసారిగా మాయమవడంతో అధికారులు, స్థానికులు అవాక్కయ్యారు. టవర్ తోపాటు 15కేవీఏ డిజిల్ జనరేటర్, ఇతర టెలికాం పరికరాలు కూడా కనిపించకుండా పోవడంతో భారీ చోరీ జరిగి ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read : China Spy Turtles : జంతువులతో సీక్రెట్ మిషన్.. తాబేళ్లు, చేపల రూపంలో గూఢచారులు?.. చైనాను వణికిస్తున్న సముద్ర రహస్యం!

ఈ ఘటన జూన్ 2న వెలుగులోకి వచ్చింది. టవర్ యాజమాన్ సంస్థ జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన సిబ్బంది, సాంకేతిక కారణాలతో చాలా కాలంగా పనిచేయకుండా ఉన్న టవర్‌ను పరిశీలించి తిరిగి ప్రారంభించేందుకు అక్కడికి వెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న వారికి టవర్ పూర్తిగా కనిపించకపోవడంతో షాక్ తగిలింది.

దీంతో సంస్థ భూసేకరణ, కార్యకలాపాల అధికారి బైజ్‌నాథ్ ఓఝా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ టవర్ స్థానికుడు హరినాథ్ యాదవ్‌కు చెందిన స్థలంలో ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. కాగా, తనకు జీటీఎల్ సంస్థతో ఉన్న ఒప్పందం 2022లో ముగిసిందని, 2017 తర్వాత ఎలాంటి అద్దె చెల్లింపులు జరగలేదని హరినాథ్ యాదవ్ పేర్కొన్నారు. ఒప్పందం ముగిసిన తర్వాత పలుమార్లు న్యాయ నోటీసులు పంపినా సంస్థ స్పందించలేదని తెలిపారు. అయితే టవర్ మాయమైన ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అది ఎలా అదృశ్యమైందో తనకూ తెలియదని చెప్పారు.

దుమ్రావ్ ఎస్‌డీపీవో పొలస్త్ కుమార్ మాట్లాడుతూ.. టవర్ అదృశ్యమైన ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. 40 మీటర్ల ఎత్తైన మొబైల్ టవర్ మొత్తం మాయమవడం ప్రస్తుతం బీహార్‌లో చర్చనీయాంశంగా మారింది.