Modi Cabinet: లడఖ్‌పై కేంద్రం వరాలు.. కీలక ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం!
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతుండగా ఎట్టకేలకు ఆ ప్రాంతానికి ఓ బహుమతి దక్కనుంది. లడఖ్‌లో మొట్ట మొదటి సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- Naresh Mannam
- Published On : July 22, 2021 / 06:44 PM IST
Modi Cabinet
Modi Cabinet: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతుండగా ఎట్టకేలకు ఆ ప్రాంతానికి ఓ బహుమతి దక్కనుంది. లడఖ్‌లో మొట్ట మొదటి సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లడఖ్‌లో కేంద్ర విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఈ రోజు(జూలై 22) ఆమోదం తెలిపినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ కేంద్ర విశ్వవిద్యాలయాన్ని రూ.750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ప్రాజెక్టు మొదటి దశను నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న మంత్రి లడఖ్ ప్రాంత అభివృద్ది కోసం లడఖ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(LIDCO) ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి క్యాబినెట్ నిర్ణయాలను ప్రకటిస్తూ తెలిపారు. లడఖ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా సెంట్రల్ యూనివర్సిటీస్ యాక్ట్ 2009ను సవరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
ఈ విశ్వ విద్యాలయాన్ని స్థాపించడం వల్ల ఉన్నత విద్యా రంగంలో ప్రాంతీయ అసమతుల్యతలను తొలగించి మేధో వృద్ధికి సహాయపడుతుందని.. ఉన్నత విద్య వ్యాప్తికి సహాయపడుతుందని ఠాకూర్ తెలిపారు. ఈ ప్రాంతంలోని ఇతర విద్యా సంస్థలకు కేంద్రీయ విశ్వ విద్యాలయం ఒక నమూనాగా నిలిచి కార్గిల్ తో సహా మొత్తం లడఖ్ ప్రాంతాన్ని కవర్ చేస్తుందని ఆయన చెప్పారు.
లడఖ్ ప్రాంత అభివృద్ది కోసం ఏర్పాటు చేయనున్న ఎల్ఐడీసీఓ (LIDCO) కార్పొరేషన్ లడఖ్‌లో పరిశ్రమలు, పర్యాటకం, రవాణా సేవలు, స్థానిక ఉత్పత్తులు, హస్తకళల మార్కెటింగ్ అభివృద్ధిని చూసుకోవడంతో పాటు ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు మంత్రి తెలియజేశారు. 25 కోట్ల అధీకృత వాటా మూలధనంతో ఏర్పాటు కానున్న ఈ కార్పొరేషన్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడటంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని మంత్రి తెలిపారు.
అండమాన్ & నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ANIIDCO) తరహాలో ఈ లడఖ్ సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని ప్యానెల్ సూచించగా.. ఇది లడఖ్ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా వివిధ అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టనుంది. అలాగే ఉక్కు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద రూ.6,322 కోట్లను కేటాయించగా.. ఎండ్ టూ ఎండ్ తయారీకి ఈ పథకం ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
