Mumbai BMW Crash : ముంబైలో ఘోర ప్రమాదం.. వంతెనపై నుంచి పడిన బీఎండబ్ల్యూ కారు.. వీడియో వైరల్

Mumbai BMW Crash : ముంబైలోని కోస్టల్‌ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Mumbai BMW Crash

Mumbai BMW Crash : ముంబైలోని కోస్టల్‌ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి వంతెన రక్షణ గోడను ఢీకొట్టి కింద ఉన్న నిర్మాణంలో ఉన్న పార్కింగ్‌ ప్రాంతంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

Also Read : Sikh Bus Driver Attacked in UK : యూకేలో సిక్కు బస్ డ్రైవర్‌పై దాడి.. గడ్డం పట్టుకుని లాగి.. దారుణం.. వీడియో వైరల్

పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 5.20 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు మెరైన్‌ డ్రైవ్‌ నుంచి హాజీఅలీ వైపు వెళ్తుండగా లోటస్‌ జెట్టీ సమీపంలో అదుపుతప్పి వంతెన పైనుంచి పడిపోయింది. కారు వేగంగా వెళ్తూ ముందుగా రక్షణ గోడను ఢీకొట్టి వంతెనపై నుంచి కిందకు పడిపోయింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నారు. వారిని వెంటనే సమీపంలోని నాయర్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే ముగ్గురు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల్లో షనాయ్‌ గజ్జల్ (21)‌, ధిర్యా సేథ్‌ (17) ఉన్నారు. మరో మృతుడి వయసు సుమారు 25 ఏళ్లుగా పోలీసులు తెలిపారు. మరో 20ఏళ్ల యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలోని ట్రామా వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

కారు పూర్తిగా ధ్వంసమైన తీరు ప్రమాదం తీవ్రతకు అద్దం పడుతోంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. విండ్‌షీల్డ్‌ పూర్తిగా పగిలిపోయింది. వంతెనకు అమర్చిన సైన్‌బోర్డును కూడా కారు ఢీకొన్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. ఈ ప్రమాదానికి అసలు కారణమేంటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా అతి వేగం, మలుపును సరిగా అంచనా వేయలేకపోవడం కారణాలుగా అనుమానిస్తున్నప్పటికీ, పూర్తి దర్యాప్తు అనంతరం మాత్రమే స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.