×
Ad

AR Rahman: దుమారం రేపుతున్న ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలు.. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

ఏఆర్ రెహ్మన్ లాంటి వ్యక్తి ఇంత దిగజారి ప్రజలను రెచ్చగొట్టే విధంగా, సమాజాన్ని అవమానించే విధంగా మతం గురించి మాట్లాడటం బాధాకరం.

AR Rahman Representative Image (Image Credit To Original Source)

  • బాలీవుడ్, మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఎనిమిదేళ్లుగా బాలీవుడ్ లో బాగా పని తగ్గింది
  • అవకాశాలు రాకపోవడం వెనుక మతపరమైన కోణం కూడా ఉండొచ్చు

AR Rahman: ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.. బాలీవుడ్ ఇండస్ట్రీ, మతపరమైన అంశాల్లో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తనకు బాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడం వెనుక మతపరమైన కోణం కూడా ఉండవచ్చని, అది నేరుగా కాకపోయినా చెప్పుడు మాటల ద్వారా తనవరకు వచ్చిందని రెహమాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

రెహమాన్ ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు చినికిచినికి సినీ, పొలిటికల్ రంగాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గత ఎనిమిదేళ్లుగా తనకు బాలీవుడ్ లో బాగా పని తగ్గిందన్నారు. అవకాశాలు రావడం రాలేదన్నారు. దీనికి బాలీవుడ్ లో జరిగిన అధికార మార్పిడి కారణం అని ఆయన కామెంట్స్ చేశారు. క్రియేటివిటీ లేని వ్యక్తులు ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ భవిష్యత్తుకు మంచిది కాదు..

రెహ్మాన్ వ్యాఖ్యలపై పలువురు నేతలు, కళాకారులు, మత సంఘాల నాయకులు స్పందించారు. ఏఆర్ రెహ్మాన్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన ఆలోచనలు దేశ భవిష్యత్తుకు మంచివి కాదన్నారు. వెంటనే ఏఆర్ రెహ్మాన్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనలో ఇన్నాళ్లు ఓ కళాకారుడినే చూశామన్నారు. మత పరంగా రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇది సమాజాన్ని అవమానించినట్లే అని కిషన్ రెడ్డి అన్నారు.

”కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభు్త్వాలు కానీ ప్రజలు కానీ మతంతో సంబంధం లేకుండా ఏఆర్ రెహమాన్ కు అన్ని రకాలుగా సానుకూలంగా స్పందించారు. ఆయనను అనేక రకాలుగా ప్రోత్సహించారు. ఏఆర్ రెహ్మాన్ అలా మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఈ రకమైన ఆలోచన దేశానికి కానీ దేశ భవిష్యత్తుకు కానీ ఏమాత్రం మంచిది కాదు. ఈ రకమైన ఆలోచన చేసే వాళ్లు ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకుని దేశ ప్రజలను క్షమాపణ కోరాలి. దేశ ప్రజలు ఆయనలో ఒక కళాకారుడినే చూశారు తప్ప మరొకటి కాదు.

రెహ్మాన్ ను కళాకారుడిగానే చూశారు..

ఏఆర్ రెహ్మాన్ హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి వెళ్లాడా? ఆయనిప్పుడు ముస్లిమా? అని ప్రజలు ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ఆయన హిందువుగా ఉండి ముస్లింగా మారినా ప్రజలు ఆ రకంగా ఆలోచన చేయలేదు. ఆయనను కళాకారుడిగానే చూశారు. ఏఆర్ రెహ్మన్ లాంటి వ్యక్తి ఇంత దిగజారి ప్రజలను రెచ్చగొట్టే విధంగా, సమాజాన్ని అవమానించే విధంగా మతం గురించి మాట్లాడటం బాధాకరం. ప్రజలు అన్ని రకాలుగా ఆయనను ప్రోత్సహించారు. ఆయన ఈ విషయాన్ని మర్చిపోవడం దురదృష్టకరం” అని కిషన్ రెడ్డి వాపోయారు.

విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ ఈ ఇష్యూపై తీవ్రంగా స్పందించారు. అవకాశాలు ఎందుకు రావడం లేదో ఏఆర్ రెహ్మాన్ తనను తాను ప్రశ్నించుకోవాలని సూచించారు. పరిశ్రమను నిందించడం తగదన్నారు. ఒకప్పుడు దిలీప్ కుమార్ గా ఉన్న రెహ్మాన్ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అర్థం లేదన్నారు. ఆయనకు అవకాశాలు కావాలంటే మళ్లీ స్వధర్మం వైపు ఘర్ వాపసీ కావాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read: ఈపీఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. ఇకపై UPI నుంచే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఎప్పటినుంచంటే?

ఏఆర్ రెహమాన్ అసలు పేరు ఏమిటి?
ఏఆర్ రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్ రాజగోపాల. మలయాళ చిత్రాలకు సినిమా సంగీత స్వరకర్త ఆర్ కె శేఖర్ కు జన్మించారు. ఆయన తల్లి పేరు కస్తూరి (తర్వాత కరీమా). 1984లో, ఆయన చెల్లెలు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు ఖాదిరి తారిఖాకు పరిచయం అయ్యారు. 1989లో 23 సంవత్సరాల వయసులో ఆయన తల్లి సోదరీమణులతో కలిసి ఇస్లాం మతంలోకి మారారు. రెహమాన్ గా పేరు మార్చుకున్నారు. తల్లి కలలో వచ్చిన తర్వాత అల్లా రఖా (AR) ను తన పేరుకు జోడించాడు.