Kanpur
Muslim Man In Kanpur ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. జై శ్రీరాం అనాలంటూ ఓ 45ఏళ్ల ముస్లిం వ్యక్తిపై కొంతమంది వ్యక్తులు మూకదాడికి పాల్పడ్డారు. అయితే తన తండ్రిని కొట్టొద్దని,తన తండ్రిని విడిచిపెట్టండి అంటూ బాధితుడి చిన్నారి కూతురు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా సదరు వ్యక్తిపై దాడికి దిగారు. అంతేకాకుండా ఆ ముస్లిం వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో కూడా ఆ ముస్లిం వ్యక్తిని కొడుతున్నట్లు ఆ వీడియో ఫుటేజ్ లో కనిపిస్తోంది.
కాగా, భజరంగ్ దళ్ గ్రూప్ బుధవారం కాన్పూర్ లో ఓ సమావేశం నిర్వహించగా..ఈ మీటింగ్ జరిగిన ప్రదేశానికి 500 మీటర్ల దూరంలోనే ఈ దాడి ఘటన జరిగింది. ఈ ప్రాంతంలోని ముస్లింలు ఒక హిందూ అమ్మాయిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ మీటింగ్ లో భజరంగ్ దళ్ సభ్యులు ఆరోపించగా..ఈ మీటింగ్ ముగిసిన కొన్ని క్షణల్లోనే ముస్లిం వ్యక్తిపై దాడి ఘటన చోటుచేసుకుంది.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాన్పూర్ పోలీసులు కేసు ఫైల్ చేసి పది మందిని అరెస్ట్ చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు..సాయంత్రం 3 గంటల సమయంలో నేను నా ఈ- రిక్షాను తోలుకుంటూ వస్తున్నాను. ఇంతలో కొంత మంది చుట్టూ చేరి నన్ను బూతులు తిడుతూ కొట్టడం ప్రారంభించారు. నన్ను కొట్టారు. నన్ను,నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. నా చేత జై శ్రీరాం నినాదాలు చేయించారు. సమయానికి పోలీసులు వచ్చారు కాబట్టి బతికి బయటపడ్డానని భాదితుడు తెలిపాడు. అయితే ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన వారిలో కొంత మంది భుజాలపై, తలపై కాషాయ కండువాలు ఉన్నాయి. దాడికి పాల్పడ్డవారు భజరంగ్ దళ్ కార్యకర్తలేనని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే సభ నిర్వహించిన భజరంగ్ దళ్ గ్రూపు సభ్యుల పేర్లను పోలీసులు వెల్లడించలేదు.
అయితే బాధిత వ్యక్తి..ఆ ప్రాంతంలోని హిందువులైన పొరుగిటింవారితో చట్టపరమైన వివాదంలో ఉన్న ఒక ముస్లిం కుటుంబానికి బంధువు. హిందువులను ముస్లింలుగా మారుస్తున్నారని ఆ ప్రాంతంలో కొంత కాలంగా భజరంగ్ దళ్ కార్యక్రమాలు నిర్వహిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో సదరు ముస్లిం కుటుంబంపై గతంలో భజరంగ్ దళ్ కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడ్డారని ఆ కుటుంబ సన్నిహితులు తెలిపారు.