×
Ad

ఏఐ సమ్మిట్‌లో షర్టులు విప్పేసి కాంగ్రెస్‌ కార్యకర్తలు రచ్చ.. మోదీ ఘాటు కామెంట్స్‌..

“కాంగ్రెస్ నేతలు మోదీని ద్వేషిస్తారు. నన్ను పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నారు. నా తల్లిని అవమానించడానికీ వెనుకాడరు” అని చెప్పారు.

  • నేషనల్‌ ప్రోగ్రామ్‌ను దెబ్బతీశారు
  • రాజకీయాల కోసం దుర్వినియోగం చేశారు
  • వ్యక్తిగత ద్వేషంతో రగిలిపోతున్నారు: మోదీ

Narendra Modi: ఢిల్లీలో నిర్వహించిన ఏఐ గ్లోబల్ సమ్మిట్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలపడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేషనల్‌ ప్రోగ్రామ్‌ను దెబ్బతీశారని అన్నారు.

మీరట్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. సాంకేతిక పురోగతి, ఆవిష్కరణలపై దృష్టి సారించిన జాతీయ కార్యక్రమ గౌరవాన్ని కాంగ్రెస్‌ నిరసన దెబ్బతీసిందని అన్నారు.

ప్రతిపక్ష నేతలు రాజకీయ విభేదాలకంటే వ్యక్తిగత ద్వేషంతో ప్రేరేపితులయ్యారని మోదీ ఆరోపించారు. “కాంగ్రెస్ నేతలు మోదీని ద్వేషిస్తారు. నన్ను పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నారు. నా తల్లిని అవమానించడానికీ వెనుకాడరు” అని చెప్పారు. ప్రతిపక్షాల తీరు జాతీయ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఉండకూడదని ఆయన తెలిపారు.

ఏఐ సమ్మిట్ బీజేపీ ప్రోగ్రాం కాదు
ఏఐ గ్లోబల్ సమ్మిట్ జాతీయ కార్యక్రమమని, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రధాని మోదీ అన్నారు. “ఏఐ గ్లోబల్ సమ్మిట్ బీజేపీ కార్యక్రమం కాదని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి, ఆ సమయంలో ఏ బీజేపీ నేతా అక్కడ లేరు. ఇది జాతీయ కార్యక్రమం. దేశం కోసం నిర్వహించిన కార్యక్రమం” అని చెప్పారు.

గ్లోబల్ వేదికను రాజకీయాల కోసం దుర్వినియోగం చేశారని కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. దేశ సాంకేతిక లక్ష్యాలను ప్రపంచానికి చూపించాల్సిన కార్యక్రమంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఈ ప్రవర్తనపై విస్తృతంగా విమర్శలు వస్తున్నాయని అన్నారు.

భారత్ మండపంలో షర్ట్‌లెస్ నిరసనతో వివాదం
ఢిల్లీలో ఉన్న భారత్ మండపం వేదికలో హాల్ నం.5లో కొంతమంది ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. అక్కడ గ్లోబల్ ఏఐ సమ్మిట్ జరుగుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 10 మంది నిరసనకారులు క్యూఆర్ కోడ్ ఎంట్రీ పాసులతో వేదికలోకి ప్రవేశించి టీ-షర్టులు తీసి ప్రధాని మోదీకి వ్యతిరేక నినాదాలు చేశారు.

వారు ధరించిన/చేతిలో పట్టుకున్న తెల్ల టీ షర్టులపై మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాలు ఉన్నాయి. అలాగే “ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్”, “ఎప్స్టీన్ ఫైల్స్”, “పీఎం ఈజ్ కంప్రమైజ్డ్” వంటి నినాదాలు ఉన్నాయి.