కరోనా మహమ్మారి దెబ్బకు దేశమంతా తాళం పడింది. దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించగా.. ఆర్థికంగా దేశం కూడా ఇబ్బందులు పడుతుంది. ఈ ప్రభావంతో అన్ని రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడిగించే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలకు కేంద్రం చెక్ పెట్టింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏప్రిల్ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారా..? లేదా అనే ప్రశ్న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత పేమాఖండూ చేసిన ట్వీట్ సమాధానంగా మారింది. ప్రధానితో సమావేశం అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ ఏప్రిల్ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేయనున్నట్లు స్పష్టం చేశారు. కానీ ప్రజలంతా బయటకు రావడానికి మాత్రం కొన్ని పరిమితులు ఉంటాయని వెల్లడించారు.
ఇదిలా ఉంటే లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ఏం చెయ్యాలనే విషాయాలపై ముఖ్యమంత్రులతో సమావేశంలో ప్రధాని చర్చించారు. కరోనావైరస్ వ్యాప్తిపై పోరాడటానికి 21 రోజుల జాతీయ లాక్‌డౌన్ ముగిసిన తరువాత జనాభా తిరిగి రోడ్ల మీదకు రావడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా సిద్ధం అవ్వాలనే దానిపై మోడీముఖ్యమంత్రులతో మాట్లాడారు. లాక్‌డౌన్ తర్వాత “యథావిధిగా వ్యాపారాలు సాగవు” అని ప్రధాని చెప్పారు.
అయితే లాక్‌డౌన్ తర్వాత కూడా కొన్ని భద్రతా చర్యలు తీసుకోవలసి ఉంటుందని, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచనలు చేశారు. లాక్‌డౌన్ తర్వాత స్థిరంగా లేని వ్యక్తుల కదలికలను గమనించడానికి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రులకు సూచించారు.