NEET Re Exam 2026: నీట్ రీ-ఎగ్జామ్ పేపర్ లీక్.. సోషల్ మీడియా ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన పీఐబీ
నీట్-యూజీ రీ-ఎగ్జామ్(NEET Re Exam 2026) ప్రశ్నపత్రం లీకైనట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టతనిచ్చింది.
- V Santhosh Kumar
- Published on- June 19, 2026 / 06:44 PM IST
Neet ug 2026 re exam paper leak video is fake clarifies pib fact check
- నీట్ పేపర్ లీక్ వీడియో నకిలీది.
- షెడ్యూల్ ప్రకారమే రీ-నీట్ పరీక్ష జరుగుతుంది.
- తప్పుడు వార్తలు నమ్మవద్దని పీఐబీ విజ్ఞప్తి.
NEET Re Exam 2026: నీట్-యూజీ రీ-ఎగ్జామ్ జూన్ 21న జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షకు సంబందించిన ప్రశ్నపత్రం లీకైనట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టతనిచ్చింది. ఈ పరీక్షకు సంబంధించి ఎలాంటి లీక్ జరగలేదని, పరీక్ష షెడ్యూల్ ప్రకారమే పక్కాగా జరుగుతుందని స్పష్టం చేసింది. పరీక్షకు ముందు ఏ వ్యక్తికి గానీ, సంస్థకు గానీ ప్రశ్నపత్రాలు దక్కే అవకాశం లేదని తేల్చిచెప్పింది.
నీట్ రీ-ఎగ్జామ్(NEET Re Exam 2026) ప్రశ్నపత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో లీక్ అయిందంటూ కొందరు నకిలీ వార్తలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని, అలాంటి తప్పుడు వార్తలను నమ్మి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేసింది. ఒక వీడియోలో ‘పేపర్-బి’ అని రాసి ఉన్న బుక్‌లెట్‌ను ఓ వ్యక్తి ఓపెన్ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ గందరగోళం నెలకొంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఆ వీడియోను పూర్తిగా నకిలీదిగా తేల్చగా, ఈ పోస్ట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కూడా షేర్ చేసింది.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇలాంటి ఏవైనా అనుమానాస్పద లేదా నకిలీ వార్తలు మీ దృష్టికి వస్తే వెంటనే వాటిని రిపోర్టు చేయాలని అధికారులు కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ నంబర్ +91 8799711259 లేదా Email: factcheck@pib.gov.in ద్వారా తమకు సమాచారం అందించి, నిజానిజాలు తెలుసుకోవాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం సూచించింది.
