NEET UG 2026 Re-Exam Date : నీట్ రీ-ఎగ్జామ్ తేదీ వచ్చేసింది.. ఎక్స్ వేదికగా వెల్లడించిన ఎన్‌టీఏ
NEET-UG 2026 Re-Exam Date : నీట్ ఎగ్జామ్ కొత్త తేదీలను NTA ప్రకటించింది. జూన్ 21వ తేదీన నీట్ యూజీ పరీక్ష ఉండనున్నట్లు తెలిపింది.
- Harish Thanniru
- Updated on- May 15, 2026 / 11:26 AM IST
NEET re-exam date 2026
NEET Re-Exam Date 2026 : దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో, ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకోసం మే3 వ తేదీన నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-యూజీ (NEET UG) రద్దయిన విషయం తెలిసిందే. పేపర్ లీక్ ఆరోపణలతో రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 21వ తేదీన (ఆదివారం) ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఎన్టీఏ కోరింది. హాల్ టికెట్, ఇతరత్రా వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.
📢 NEET (UG) 2026 — Examination Date Announced
The National Testing Agency, with the approval of the Government of India, has scheduled the re-examination of NEET (UG) 2026 on Sunday, 21 June 2026.
Candidates and parents are requested to rely only on the official channels of NTA.…— National Testing Agency (@NTA_Exams) May 15, 2026
దేశవ్యాప్తంగా మే3వ తేదీన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష -యూజీని (నీట్-యూజీ) నిర్వహించిన విషయం తెలిసిందే. 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. అయితే, ఈ పరీక్ష ప్రశ్నాపత్రాలు కొన్నిచోట్ల లీకయ్యాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మే3వ తేదీన నిర్వహించిన పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. మళ్లీ రీ-ఎగ్జామ్ నిర్వహిస్తామని తెలిపింది. అయితే, రీ ఎగ్జామ్ కు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన పనిలేదని, ఫీజు కూడా చెల్లించే అవసరం లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. దీంతో తాజాగా.. జూన్ 21వ తేదీన రీ-ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుందని ఎన్టీఏ అధికారికంగా ప్రకటించింది.
మరోవైపు.. నీట్ పేపర్ లీక్ పై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కీలక నిందితులను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు వారిని విచారిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని సికార్‌లో ఈ లీకేజీ వ్యవహారం బయటపడింది. అయితే, మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి రాజస్థాన్, హరియాణా, జమ్మూకశ్మీర్, కేరళ సహా పలు రాష్ట్రాలకు లీక్ అయిన పేపర్ చేరినట్లు దర్యాప్తులో తేలింది. అయితే, ఈ పేపర్ కోసం విద్యార్థుల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, సీబీఐ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
