Bihar : నేపాల్ వరదల ఎఫెక్ట్.. బిహార్‌లో హైఅలర్ట్.. వరద నీటిలో దొరికిన చేపలు తినొద్దని హెచ్చరిక.. ఎందుకంటే?
Bihar On Alert After Nepal Tragedy : నేపాల్‌లో సంభవించిన భారీ వరదల ప్రభావం బిహార్‌పై తీవ్రంగా పడుతోంది. బీహార్ లోని ఆయా ప్రాంతాల్లో దొరికే చేపలు అస్సులు తినొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
- Harish Thanniru
- Updated on- September 1, 2026 / 10:12 PM IST
Nepal Floods
Bihar On Alert Nepal Tragedy : నేపాల్‌లో సంభవించిన భారీ వరదల ప్రభావం బిహార్‌పై తీవ్రంగా పడుతోంది. నేపాల్‌లోని త్రిశూలి నది నుంచి వచ్చిన వరద నీరు గండక్, కోసీ నదుల్లోకి చేరడంతో బిహార్‌లోని పలు ప్రాంతాల్లో నీటిమట్టాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. వరద నీటితో కొట్టుకొచ్చిన చేపలను పట్టుకోవడం, విక్రయించడం, తినడం చేయొద్దని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య వనరుల శాఖ ప్రజలను కోరింది.
Also Read : Srikakulam Corporation : సిక్కోలు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగేనా.? 15ఏళ్ల తర్వాత అయినా పీటముడి వీడేనా.
వరద నీటిలో మురుగునీరు, చనిపోయిన జంతువులు, ఇతర వ్యర్థాలు కలిసే అవకాశం ఉండటంతో.. ఆ నీటిలో చిక్కుకున్న చేపల్లో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర హానికర సూక్ష్మజీవులు ఉండే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు వరద నీటిలో పట్టిన చేపలను తినొద్దని సూచించారు. వరద నీటిలో దొరికిన చేపలను తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని అధికారులు సూచించారు. అలాగే అసాధారణంగా కనిపించే చేపలు ఎక్కడైనా కనిపిస్తే స్థానిక జిల్లా మత్స్యశాఖ అధికారి లేదంటే స్థానిక అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని కోరారు. వదంతులను నమ్మకుండా.. తెలియని కొత్తరకం చేపలను ఆహారంగా తీసుకోవద్దని స్పష్టం చేశారు.
నేపాల్‌లోని వరదలు, కొండచరియలు, మంచు సరస్సుల ఉప్పెనల కారణంగా బురద, మట్టి, రాళ్లు, చెట్ల దుంగలతో పాటు వివిధ రకాల వ్యర్థాలు నదుల్లోకి కొట్టుకొస్తున్నాయి. ధ్వంసమైన వంతెనలు, హైడ్రోపవర్ ప్రాజెక్టుల అవశేషాలు, వాహనాలు, గృహోపకరణాలు, ఎల్‌పీజీ సిలిండర్లు కూడా బిహార్ వైపు నదుల్లో కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. మానవ, జంతు కళేబరాలు నీటిలో కలవడం వల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది.
వరద నీరు చేతిపంపులు, బావులు వంటి తాగునీటి వనరుల్లో కలిస్తే డయేరియా, కలరా, టైఫాయిడ్, హెపటైటిస్-ఏ, హెపటైటిస్-ఈ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేపాల్ సరిహద్దులోని బిహార్ జిల్లాలైన వెస్ట్ చంపారన్, ఈస్ట్ చంపారన్, సీతామఢి, కిషన్‌గంజ్, పూర్ణియా, అరారియా తదితర ప్రాంతాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. వరద నీటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నదుల నీటిమట్టాలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రజలు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
