LPG Rule Changes : గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్..
LPG Rule Changes : దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురానుంది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
- Harish Thanniru
- Updated on- May 30, 2026 / 02:08 PM IST
LPG Rule Changes
LPG Rule Changes : పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండటంతో భారతదేశంకు గ్యాస్, కూడ్రాయిల్ సరఫరా తగ్గిపోయింది. దీంతో గ్యాస్ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎల్పీజీ గ్యాస్ వినియోగంపై కేంద్రం ఇప్పటికే పలు నిబంధనలు పెట్టింది. అయితే, తాజాగా.. దేశ వ్యాప్తంగా ఎల్పీజీ (LPG) వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురానుంది. కొత్త నిబంధనలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి.
కొత్త నిబంధనలు ఇవే..
♦ ఒక ఇంటికి ఒకే కనెక్షన్ రూల్ జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ విధానం ద్వారా.. ఇకపై ఒకే చిరుమానాలో పీఎన్‌జీ, ఎల్‌పీజీ రెండు రకాల కనెక్షన్లు కలిగి ఉండటాన్ని నిషేధంగా పరిగణిస్తారు.
♦ పీఎన్‌జీ మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తూ.. ఇంకా ఎల్‌పీజీ వాడుతున్న వారు నిర్ణీత గడువులోగా మారకపోతే వారి ఎల్‌పీజీ సరఫరా నిలిచిపోతుంది లేదంటే రద్దవుతుంది.
♦ పైప్‌లైన్ గ్యాస్ యాక్టివ్‌గా ఉన్న ఇళ్లకు సిలిండర్లను బుక్ చేసుకోకుండా ఉండేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లు తమ డిజిటల్ డేటాబేస్‌లను అనుసంధానించాయి. ఫలితంగా అలాంటి వారికి రీఫిల్ బుకింగ్స్ బ్లాక్ అవుతాయి.
♦ ఇక్కడ వినియోగదారులకు కొంత ఊరట కలిగించే అంశం ఏమిటంటే.. పీఎన్‌జీ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోపు ఎల్పీజీ కనెక్షన్ ను నిలిపివేసిన వారు భవిష్యత్తులో అవసరమైతే తమ ఎల్పీజీ కనెక్షన్ ను తిరిగి యాక్టివేట్ తీసుకునే అవకాశం ఉంటుంది.
♦ పీఎన్‌జీ విస్తరణను మరింత వేగవంతం చేయడానికి నేషనల్ పీఎన్‌జీ డ్రైవ్ 2.0 గడువును జూన్ 30 వరకు పొడిగించారు.
♦ ప్రభుత్వం ఏడాదికి అందించే 12 సబ్సిడీ సిలిండర్ల పరిమితి యథాతథంగా కొనసాగుతంది. అదనపు సిలిండర్లకు మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది.
♦ కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు డిపాజిట్, రెగ్యులేటర్, పైపు మరియు ఇన్‌స్టాలేషన్‌కు సంబంధించిన సవరించిన ఫీజులు కూడా వర్తించనున్నాయి.
♦ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త నిబంధనలతో ఎల్పీజీ వినియోగంలో పారదర్శకత పెరగడంతోపాటు గ్యాస్ సబ్సిడీల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
