Cashless Payments at Toll Plazas : వాహనదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. టోల్ ప్లాజాల వద్ద ఇకపై అలా కుదరదు
Cashless Payments at Toll Plazas : వాహనదారులకి అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల వద్ద కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి.
- Dharani Pilli
- Published On : April 1, 2026 / 07:34 AM IST
nhai implements cashless payments at toll plazas across highways from 2026 april 1
- వాహనదారులకి కీలక అలర్ట్
- టోల్ ప్లాజాల వద్ద క్యాష్ లెస్ పేమెంట్స్
- ఏప్రిల్ 1 నుంచి అమలు
Cashless Payments at Toll Plazas : ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీంతో కొన్ని కొత్త నియమాలు అమల్లోకి వస్తాయి. ఈక్రమంలోనే ఏప్రిల్ 1న వాహనదారులకు కీలక అలర్ట్ జారీ చేశారు. నేషనల్ హైవేల మీద ప్రయాణించేవారికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)) కీలక ప్రకటన జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి అంటే ఇవాళ్టి నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు. దీని గురించి NHAI గత నెలలోనే ప్రకటించింది. ఆ ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి నేషనల్ హైవేల మీద ప్రయాణించే వాహనదారులు.. ఇకపై టోల్ ఫీజులను ఫాస్టాగ్, లేదా యూపీఐ వంటి డిజిటల్ పద్ధతుల్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశంలోని అన్ని నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్ రహదారులపై ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.
మిగతా సమయాల్లో ఎలా ఉన్నా పండగ సమయాల్లో టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు చెల్లింపులో ఆలస్యం కారణంగా కిలోమీటర్ల మేర రోడ్డు మీద బారులు తీరి ఉంటాయి. ఈక్రమంలో వాహనాల రద్దీని తగ్గించి.. ప్రయాణ సమయాన్ని ఆదా చేయాలనే లక్ష్యంతో NHAI నగదు రహిత విధానాన్ని అమలు చేస్తున్నారు. సుమారు 98 శాతం నేషనల్ హైవే టోల్ ప్లాజాల్లో ఇప్పటికే టోల్ చెల్లింపులు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే దీన్ని పూర్తి స్థాయిలో డిజిటల్‌కు మార్చాలనే ఉద్దేశంతో ఎన్‌హెచ్‌ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల.. టోల్ వసూళ్లలో పారదర్శకతను పెంచడం మాత్రమే కాక.. వాహనాలు టోల్ గేట్ల వద్ద ఎక్కువ సేపు నిరీక్షించకుండా త్వరగా వెళ్లేందుకు దోహదం చేస్తుంది.
ఒకవేళ వాహనదారుల ఫాస్టాగ్‌లో ఏదైనా సమస్య తలెత్తితే.. టోల్ బూత్‌ల వద్ద ఉండే క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి యూపీఐ ద్వారా వెంటనే టోల్ ఫీజు చెల్లించవచ్చు. అయితే కొన్నిసార్లు నెట్, సిగ్నల్ సమస్యల వల్ల యూపీఐ పేమెంట్స్ కూడా ఆలస్యం అవుతాయి. అందుకే వాహనాదారులు.. ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందే.. ఫాస్టాగ్ ను యాక్టీవేట్ చేసుకోవడంతో పాటు దానిలో సరిపడా బ్యాలెన్స్ ఉంచుకోవడం మంచిది.
