Driving Licence : వాహనదారులకు బిగ్ అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో కేంద్రం కీలక మార్పులు.. హద్దుమీరితే రద్దే!
Driving Licence New Rules : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలతో పాటు పాయింట్ల రూపంలో కూడా శిక్ష పడే అవకాశం ఉంది. పదేపదే తప్పులు చేస్తే లైసెన్స్ కోల్పోయే పరిస్థితి రావచ్చు. త్వరలో ఈ ప్రతిపాదనను అమల్లోకి తీసుకొచ్చేలా కేంద్ర ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
- Harish Thanniru
- Published on- September 5, 2026 / 10:46 AM IST
Driving Licence New Rules
Driving Licence New Rules : ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధంగా.. ఇష్టానుసారంగా వాహనాలు నడిపేవారికి ఇది బిగ్ షాకింగ్ న్యూస్. డ్రైవింగ్ లైసెన్స్ ఉందని ఇష్టారాజ్యంగా వాహనం నడపడం చేస్తే కుదరదు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారికి కేంద్రం షాకింగ్ రూల్ తీసుకురాబోతోంది. ఇకపై ప్రతి ట్రాఫిక్ తప్పిదానికి డ్రైవింగ్ లైసెన్స్‌లో పాయింట్లు కట్ అయ్యే విధానాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. పదేపదే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతోపాటు.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే మీ డ్రైవింగ్ లైసెన్సులో పాయింట్లు తగ్గిపోయి లైసెన్స్ రద్దు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. మరోవైపు.. బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేస్తూ గుడ్ పాయింట్లు కలిగిఉన్న వారికి ప్రోత్సాహకాలతోపాటు బీమా సంస్థల నుంచి ప్రయోజనాలు కల్పించే ఆలోచన కూడా కేంద్రం చేస్తోంది.
దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రతీయేటా ఐదు లక్షలకుపైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో సుమారు 1.80లక్షల మంది చనిపోతున్నారు. అయితే, ఈ ప్రమాదాల్లో ఎక్కువశాతం డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని గణాంకాలు పేర్కొంటున్నాయి. రానున్నకాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గించేందుకు కేంద్రం కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రమాదాలను తగ్గించడంతో పాటు వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై మరింత బాధ్యత పెంచేందుకు కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC)కు గ్రేడెడ్ పాయింట్ల విధానాన్ని తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవింగ్ లైసెన్స్ రికార్డును, ట్రాఫిక్ ఉల్లంఘనలను లింక్ చేసే వ్యవస్థ ఉంటుంది. వాహనాల రిజిస్ట్రేషన్ల సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులకు గ్రేడింగ్ పాయింట్లు ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘించిన ప్రతిసారీ తప్పిదం తీవ్రతకు అనుగుణంగా పెనాల్టీ పాయింట్లు నమోదయ్యే అవకాశం ఉంది.
అంటే ఓవర్‌స్పీడ్, ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘన, ప్రమాదకర డ్రైవింగ్ వంటి తప్పిదాలు పదేపదే చేస్తే డ్రైవర్ ఖాతాలో నెగెటివ్ పాయింట్లు పెరుగుతాయి. నెగిటివ్ పాయింట్ల పరిమితి దాటిన తరువాత అధికారులు రంగంలోకి దిగి నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిపై చర్యలు చేపడతారు. అతని డ్రైవింగ్ లైసెన్సును రద్దు కూడా చేయవచ్చు. అయితే ఎన్ని పాయింట్లకు ఏ చర్య తీసుకోవాలనే అంశంపై మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు.
తాజా ప్రతిపాదనలో మరో కొత్త అంశం ఏమిటంటే.. ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా మంచి డ్రైవింగ్ రికార్డు కొనసాగించే వారికి పాజిటివ్ పాయింట్లు లేదంటే ఇతర ప్రోత్సాహకాలు అందించే అవకాశం ఉంది. ఇలాంటి మంచి డ్రైవింగ్ రికార్డును బీమా సంస్థలు కూడా పరిగణనలోకి తీసుకుని ప్రయోజనాలు కల్పించే అవకాశాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తావించారు. మొత్తానికి దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, డ్రైవర్ల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
