Aadhaar Cards : ఆధార్‌పై సంచలనం.. అక్కడ 18 ఏళ్లు దాటితే ఇచ్చేది లేదు..!
Aadhaar Cards : ఆధార్ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇకపై రాష్ట్రంలో 18 ఏళ్లు దాటినవారికి ఆధార్ కార్డు జారీని నిలిపివేయనుంది. ఈ నిర్ణయం వెనుక అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- June 13, 2026 / 05:23 PM IST
Aadhaar Cards Ban
- ఆధార్ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం
- 18 ఏళ్లు దాటిన వారికి ఆధార్ కార్డు ఇచ్చే ప్రసక్తి లేదు
- ఏప్రిల్ 2027 నుంచి ఆధార్ జారీపై పూర్తిగా నిషేధం
Aadhaar Cards : ఆధార్ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ రాష్ట్రంలో 18 ఏళ్లు దాటినవారికి ఆధార్ కార్డు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది. రాష్ట్రంలోకి అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఆధార్ కార్డులను (Aadhaar Cards) అందరికి ఇవ్వడంతో రాష్ట్ర ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన మొదలైంది.
దాంతో ఆధార్ కార్డులను 18ఏళ్లు పైబడిన వారికి జారీ చేయడం నిలిపివేయాలని అస్సాం మంత్రివర్గం నిర్ణయించిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. ‘18 ఏళ్లు పైబడిన ఏ ఒక్కరికి కూడా ఆధార్ కార్డులు ఇవ్వరాదని అస్సాం కేబినెట్ నిర్ణయించింది’ అని గౌహతిలో క్యాబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా సీఎం శర్మ విలేకరులతో చెప్పారు.
2027 మార్చి వరకే ఆధార్ జారీ :
ఎస్టీ, ఎస్సీ, తేయాకు తోటల సాగువారికి 2027 మార్చి వరకు ఆధార్ కార్డు లభిస్తుందన్నారు. అలాగే, ఆధార్ కార్డు జారీకి సంబంధించి జిల్లా కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాల్సి ఉంటుందని శర్మ తెలిపారు. ఆపై దరఖాస్తుదారు ఆధార్ కార్డుకు అర్హులా కాదా అని ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆధార్ కార్డుల జారీ అనేది ఆశించిన స్థాయిలోనే ఉందని సీఎం వ్యాఖ్యానించారు.
‘కొన్ని జిల్లాల్లో ఆధార్ కార్డుల జారీ 100 శాతం మార్కును దాటింది. అదనపు ఆధార్ కార్డులు తీసుకుంటున్న ఈ వ్యక్తులు ఎవరో నిర్ధారించాల్సి ఉంది. అక్రమ బంగ్లాదేశీయులకు ఆధార్ కార్డులు జారీ కాకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. 18 ఏళ్లలోపు వారికి మాత్రమే ఆధార్ కార్డులను జారీ చేయనున్నట్టు సీఎం శర్మ తెలిపారు.
ఏప్రిల్ 2027 నుంచి పూర్తిగా నిషేధం :
2027 ఏప్రిల్ 1 నుంచి ఈ నిషేధం పూర్తిగా అమల్లోకి వస్తుంది. ఆ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన తేయాకు తోటలు, ఎస్టీ వర్గాల ప్రజలకు ఆధార్ జారీ కాదని తెలిపారు. ఆధార్ కార్డుల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు.
అస్సాంలో ఆధార్ పొందడం అంత ఈజీ కాదన్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా ఆధార్ కార్డుల జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలను పరిశీలిస్తోందని సీఎం గతంలోనే ప్రస్తావించారు.
గత ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా చొరబాటుదారుల విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. అస్సాం నుంచి తరిమికొట్టడానికి బీజేపీకి మరో ఐదేళ్ల సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను ఆయన కోరారు. చొరబాటుదారులు స్థానిక అస్సామీ ప్రజల ఉద్యోగాలకు, ఆహార ధాన్యాలకు, భూములకు ముప్పుగా అమిత్ షా అభివర్ణించారు.
