Petrol Diesel Prices: పెట్రోల్ రేట్లు పెరగవు.. తేల్చి చెప్పిన కేంద్రం..
ఎల్పీజీ, పెట్రోలియం, డీజిల్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, ధరలు కూడా పెరగలేదని, కాబట్టి ఆందోళన చెందవద్దని శర్మ కోరారు.
- Naveen
- Updated on- April 28, 2026 / 06:03 PM IST
Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదేమో అన్న ఆందోళన వ్యక్తం అవుతున్న తరుణంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. జనాలకు బిగ్ రిలీఫ్ ఇచ్చే స్టేట్ మెంట్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగవు అని తేల్చి చెప్పింది కేంద్రం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. వాటిని మరోసారి తోసిపుచ్చింది.
దీనికి సంబంధించి పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా క్రూడాయిల్, ఎల్పీజీ, పీఎన్ జీ దిగుమతులు ప్రభావితం అయిన మాట వాస్తవమే అన్నారు. అయినప్పటికీ దేశంలో సరిపడ ఇంధన నిల్వలు ఉన్నాయని, ధరలు కూడా పెంచడం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురికావొద్దని కోరారు.
”పశ్చిమాసియా సంక్షోభం కారణంగా భారీ స్థాయిలో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ లేదు” అని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ స్పష్టం చేశారు. ఎల్పీజీ, పెట్రోలియం, డీజిల్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, ధరలు కూడా పెరగలేదని, కాబట్టి ఆందోళన చెందవద్దని కోరారు. పశ్చిమ ఆసియా సంఘర్షణ కారణంగా ముడి చమురు, ఎల్పీజీ, పీఎన్‌జీ దిగుమతుల్లో ఏర్పడిన అంతరాయాలను గృహాలపై ప్రభావాన్ని పరిమితం చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. గృహ ఎల్పీజీ వినియోగదారులకు, పీఎన్‌జీ గృహాలకు, రవాణాలో ఉపయోగించే సీఎన్‌జీకి నిరంతరాయ సరఫరా ఉందన్నారు.
కమర్షియల్ ఎల్పీజీ విషయానికొస్తే ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర సేవలకు ప్రాధాన్యతనిస్తూ, సరఫరాలను దాదాపు 70 శాతానికి పాక్షికంగా పునరుద్ధరించినట్లు వివరించారు. ఫార్మాస్యూటికల్స్, ఉక్కు, విత్తనాలతో సహా కీలక పరిశ్రమలకు కూడా కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
గృహ వినియోగదారులకు ఎల్‌పీజీ, పీఎన్‌జీలతో పాటు రవాణకు సీఎన్‌జీని కూడా 100 శాతం సరఫరా చేస్తున్నామని శర్మ తెలిపారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ కు రూ. 25-28 వరకు పెంచవచ్చని వచ్చిన వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఈ వివరణ వచ్చింది.
