Oil Companies: పెట్రోల్ బంకులకు చమురు సంస్థలు బిగ్ షాక్.. అదే జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదం..!
ముఖ్యంగా రవాణ సౌకర్యాలు తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తే ప్రజల్లో భయం మొదలు కానుంది.
- Naveen
- Published On : March 17, 2026 / 07:01 PM IST
- క్రెడిట్ పాలసీ నిలిపివేసిన చమురు సంస్థలు
- పెట్రోల్ బంకులు మూతపడే అవకాశం
- పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యే అవకాశం
- దేశంలో ద్రవ్యోల్బణం రేటు పైకి వెళ్లే భయాలు
- ప్రజలపై నిత్యవసరాల భారం పడే ప్రమాదం
- ఇంధన రంగం సంక్షోభంలోకి వెళ్తే చాన్స్
Oil Companies: పెట్రోల్ బంక్ డీలర్లకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో క్రూడాయిల్ సప్లయ్ లో ఇబ్బందులు ఎదురవుతుండటంతో చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రిటైల్ ఔట్ లెట్ కు క్రెడిట్ సరఫరాను నిలివేసిన చమురు సరఫరా కంపెనీలు చెల్లింపు నిబంధనలను మరింత కఠినతరం చేశాయి. ముందస్తు చెల్లింపులు చేస్తేనే పెట్రోల్, డీజిల్ ఇస్తామంటూ కంపెనీలు తేల్చి చెప్పడంతో పెట్రోల్ బంకులు నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు.
అందుకే క్రెడిట్ పాలసీ రద్దు..
ముందస్తు చెల్లింపులు చేయాల్సిందేనని హెచ్ పీసీఎల్, బీపీసీఎల్ తేల్చి చెబుతుండగా ఐదు రోజుల రివాల్వింగ్ క్రెడిట్ పాలసీని ఐవోసీఎల్ నిలిపివేసింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా రిటైల్ ధరలను పెంచకపోవడంతో చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరిగింది. అందుకే క్రెడిట్ సరఫరాను చమురు సంస్థలు నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ఇక క్యాష్ అండ్ క్యారీ అమలు..
సాధారణంగా పెట్రోల్ బంకులకు చమురు సంస్థలు మూడు నుంచి 5 రోజుల పాటు క్రెడిట్ సౌకర్యాన్ని కల్పిస్తాయి. తాజా పరిణామాల వల్ల ఈ సదుపాయాన్ని ఆయా కంపెనీలు రద్దు చేశాయి. డీలర్లు పెట్రోల్, డీజిల్ అమ్మితే వచ్చిన డబ్బును 6వ రోజు కంపెనీలకు చెల్లిస్తారు. దీన్నే రివాల్వింగ్ క్రెడిట్ అంటారు. ఇప్పుడు ఈ విధానానికి స్వస్తి పలికి క్యాష్ అండ్ క్యారీ పద్ధతిని అమలు చేస్తున్నారు.
పెట్రోల్ బంకుల నిర్వాహకులపై ఆర్థిక భారం..
గత వారం నుంచే హెచ్ పీసీఎల్, బీపీసీఎల్ క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేయగా.. ఈ నెల 16వ తేదీ నుంచి ఐవోసీఎల్ కూడా ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులు ముందుగా డబ్బు చెల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ లోడ్ ని పంపిస్తామని స్పష్టం చేశాయి. చమురు కంపెనీల తాజా నిర్ణయంతో పెట్రోల్ బంకుల నిర్వాహకులపై ఆర్థిక భారం పడనుంది. సాధారణంగా పెట్రోల్ లేదా డీజిల్ ట్యాంకర్ లోడ్ కావాలంటే 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. గతంలో మూడు నుంచి 5 రోజుల క్రెడిట్ ఉండటంతో పెట్రోల్, డీజిల్ అమ్మిన తర్వాత డబ్బులు కట్టే వారు. ఇప్పుడు ముందే అంత పెద్ద మొత్తంలో నగదు సర్దుబాటు చేయడం చిన్న, గ్రామీణ ప్రాంత డీలర్లకు కష్టంగా మారుతోంది.
అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సిందే..!
ముందస్తు చెల్లింపుల కోసం డీలర్లు అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇది వారి లాభాలను దెబ్బతీస్తుంది. డీలర్ల దగ్గర తగినంత నగదు లేకపోతే వారు ఆర్డర్లు పెట్టడం తగ్గిస్తారు. బంకుల్లో నిల్వలు అయిపోయినా కొత్త లోడ్ తెచ్చుకోవడానికి డబ్బులు లేక బంకులను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితులు వస్తాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో స్టాక్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదం?
ముఖ్యంగా రవాణ సౌకర్యాలు తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తే ప్రజల్లో భయం మొదలు కానుంది. పెట్రోల్ దొరకదేమో అన్న ఆందోళనతో వాహనదారులు బంకుల ముందు క్యూ కడతారు. కొరతను సాకుగా చూపి కొందరు అధిక ధరకు పెట్రోల్, డీజిల్ విక్రయించే ఛాన్స్ ఉందంటున్నారు.
డీజిల్ కొరత ఏర్పడితే రవాణ వ్యవస్థ స్తంభిస్తుంది. దీని వల్ల పాలు, కూరగాయలు వంటి నిత్యవసర వస్తువుల రవాణ ఆగిపోతే మార్కెట్ లో వాటి ధరలు అమాంతం పెరిగిపోయే ప్రమాదం ఉంది. చమురు సంస్థలు ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా తీసుకున్నప్పటికీ.. ఇది సుదీర్ఘ కాలం కొనసాగిస్తే ఇంధన రంగం తీవ్ర సంక్షోభంలో పడే అవకాశం ఉందని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
