Passport-Citizenship Row: పాస్ పోర్టు పౌరసత్వం కాదు.. మరి ఇవన్నీ ఎందుకు?

Passport-Citizenship Row: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. పాస్ పోర్టు అనేది భారత పౌరసత్వం కిందకు రాదని, అది కేవలం ప్రయాణానికి ఉపయోగపడే ఒక సాధనంగా పేర్కొంది.

  • Updated on- June 25, 2026 / 05:48 PM IST

Passport is Travel Document Not Proof of Indian Citizenship

Passport-Citizenship Row: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. పాస్ పోర్టు అనేది భారత పౌరసత్వం కిందకు రాదని, అది కేవలం ప్రయాణానికి ఉపయోగపడే ఒక సాధనంగా పేర్కొంది. అంటే మీకు ఇండియన్ పాస్ పోర్టుని మీ సిటిజన్ షిప్ కింద చూపించలేరన్నమాట. కేంద్రం తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాల వల్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కొన్ని కొన్ని సార్లు జనం ఇలాంటి ప్రకటనలను తలతిక్క నిర్ణయాలుగా కూడా అభివర్ణించే అవకాశాలు ఉంటాయి.

ఈ ప్రశ్నలకు బదులేది?

మీకు గనక పాస్ పోర్టు ఉంటే దాని వెనుక చూస్తే ఒకటి రాసి ఉంటుంది. ‘ఈ పాస్ పోర్టు భారత ప్రభుత్వానికి సంబంధించినది. మీరు వేరే దేశం సిటిజన్ షిప్ తీసుకుంటే దీన్ని సరెండర్ చేయాలి’ అని రాసి ఉంటుంది. 1955 ఇండియన్ సిటిజన్ షిప్ చట్టం ప్రకారం భారతదేశం రెండు పౌరసత్వాలను అంగీకరించదు. ఒకవేళ ఎవరైనా స్వచ్ఛందంగా వేరే దేశం పౌరసత్వం తీసుకుంటే.. 1967 పాస్ పోర్ట్ యాక్ట్ ప్రకారం ఆ పాస్ పోర్టును అప్పగించాలి. లేకపోతే నేరం అవుతుంది.

అసలు పాస్ పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాకపోతే వేరేదేశం సిటిజన్ షిప్ తీసుకున్నప్పుడు దీన్ని వెనక్కి ఇచ్చేయాల్సిన అవసరం ఏముంది?. వేరే దేశం పౌరసత్వం తీసుకుని పాస్ పోర్టు అప్పగించని వాళ్ల మీద ఫైన్లు, కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది?

Also Read: రైతుల కోసం ముగ్గురు సీఎంలు ఏకమై.. తుంగభద్రకు మళ్లీ వైభవం!

పోలీస్ వెరిఫికేషన్ అవసరం ఏముంది?

మన దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు.. ఇలా రకరకాల కార్డులు తీసుకుంటాం. కానీ ఏ కార్డుకి కూడా పోలీస్ వెరిఫికేషన్ చేయరు. పాస్ పోర్టుకి మాత్రమే పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు. ఇది అసలు పౌరసత్వానికి రుజువే కాకపోతే అసలు ఇంత తతంగం ఎందుకు? పాస్ పోర్టు ఆఫీసు ముందు తెల్లవారుజాము నుంచి లైన్లలో నుంచోవడం ఎందుకు? వాళ్లకు ఫీజులు ఎందుకు?

వేరే దేశస్తులకు కూడా ఇండియన్ పాస్ పోర్టు ఇస్తారా?

అసలు ఇవన్నీ కాదు. భారతీయులకు కాకుండా వేరే దేశస్తులకు కూడా ట్రావెల్ కోసం ఇండియన్ పాస్ పోర్టు ఇస్తారా? అలాంటి చట్టాలు ఏమైనా దేశంలో ఉన్నాయా? అసలు ఆ సంగతే ఎవరికీ తెలియదు. అత్యవసర సందర్భాల్లో ఎవరికైనా గతంలో ఇలా ఇచ్చారా? అసలు దేశంలో ఇలా విదేశీయులకు ట్రావెల్ కోసం ఇండియన్ పాస్ పోర్టులు జారీ చేశారా? వీటికి సమాధానాలు చెప్పేవారు ఎవరు?

పాస్ పోర్టు మీద హక్కులు అన్నీ ప్రభుత్వానివే..
ఆధార్ , పాన్ కార్డు లాగా కాకుండా పాస్ పోర్టు అనేదానికి భారత ప్రభుత్వ ఆస్తిగా చెబుతుంది. పాస్ పోర్ట్ చట్టం 1967 లోని సెక్షన్ 17 ప్రకారం ‘పాస్ పోర్టు అనేది భారత ప్రభుత్వ ఆస్తి. దీని మీద సర్వహక్కులు ప్రభుత్వానికి ఉంటాయి. దీన్ని రద్దు చేయొచ్చు. హోల్డ్ చేయొచ్చు.’

అమెరికా పంపేస్తుంటే వాళ్లు మా వాళ్లు కాదంటారా?

తాజాగా అమెరికా నుంచి చాలా మంది వలస వాదులను పంపేశారు. అలాంటప్పుడు ‘వాళ్ల దగ్గర మా పాస్ పోర్టు ఉంది కానీ, వాళ్లు మా పౌరులు కాదు.’ అని భారత ప్రభుత్వం అమెరికాకి చెప్పిందా? పోనీ భవిష్యత్తులో చెబుతుందా?

140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో, ఆల్రెడీ జనాలకు ఉన్న సవాలక్ష సమస్యలకు తోడు ప్రభుత్వాలే అప్పుడప్పుడు ఇలాంటి ప్రకటనలతో మరింత గందరగోళంలోకి పడేయడం సరికాదనేది మేధావుల వాదన.