Tungabhadra Dam : రైతుల కోసం ముగ్గురు సీఎంలు ఏకమై.. తుంగభద్రకు మళ్లీ వైభవం!
Tungabhadra Dam : రైతుల కోసం మూడు రాష్ట్రాల సీఎంలు చేతులు కలిపారు. తుంగభద్ర డ్యామ్‌కు కొత్త ఊపిరిని అందించారు. ఏకగ్రీవ నిర్ణయంతో రైతుల సాగునీటి అవసరాలు, డ్యామ్ భద్రత, అంతర్రాష్ట్ర జల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రస్తావించారు.
Tungabhadra Dam
రైతుల సంక్షేమం కోసం మూడు రాష్ట్రాల సీఎంలు కదిలివచ్చారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఒకేతాటిపై నిలబడి తుంగభద్ర డ్యామ్ కు కొత్త ఊపిరిని అందించారు. కర్ణాటకలో రాష్ట్రంలోని తుంగభద్ర డ్యామ్ వద్ద రూ.51 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 33 కొత్త క్రస్ట్ గేట్లను ముగ్గురు సీఎంలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ప్రారంభించారు. రైతుల సాగునీటి అవసరాలు, డ్యామ్ భద్రత, అంతర్రాష్ట్ర జల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై నేతలు కీలక విషయాలను వెల్లడించారు..
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే? :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యామ్ ఓపెనింగ్ అనేది కేవలం 33 గేట్ల పునరుద్ధరణ కార్యక్రమం మాత్రమే కాదన్నారు. దశాబ్దాలుగా సాగుతున్న నీటి సమస్యలకు అసలైన పరిష్కారం చూపే కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 3 రాష్ట్రాలు కలిసి ముందుకు రావడం చారిత్రాత్మక పరిణామంగా సీఎం రేవంత్ అభివర్ణించారు.
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) పరిధిలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 17.9 టీఎంసీల నీటిలో ప్రస్తుతం 5 టీఎంసీల నుంచి 6 టీఎంసీలు మాత్రమే వినియోగంలోకి వస్తున్నాయని అన్నారు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడంతో పాటు ఇతర సాంకేతిక సమస్యలతో పూర్తి స్థాయిలో రాష్ట్రానికి నీరు అందడం లేదన్నారు.
ఈ నీటి సమస్యలను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాలు ఏకమై చర్చలు జరపడం వల్ల అంతర్రాష్ట్ర జలవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
సీఎం చంద్రబాబు ఏమన్నారంటే? :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యామ్ 3 రాష్ట్రాల రైతులకు జీవనాడిగా నిలుస్తోందని చెప్పారు. గత ఏడాది డ్యామ్‌లో 19వ గేట్ దెబ్బతిన్న సమయంలో స్టాప్‌లాక్ గేట్ ఏర్పాటు చేయడంతో భారీగా నీటి వృథాను అరికట్టినట్టు ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
Read Also : TG 10th Supplementary Results 2026 : తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదిగో..
అయితే, ఇప్పుడు 33 కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటుతో డ్యామ్ భద్రత మరింత బలోపేతమైందని చెప్పారు. రైతులకు సాగునీటి సరఫరా కూడా అందుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో నీటి నిర్వహణ సమర్థవంతంగా సాగుతుందని తెలిపారు.
నదుల అనుసంధానంపై బాబు సూచనలివే :
దేశ భవిష్యత్తు బాగుండాలంటే నదుల అనుసంధానం అనేది అత్యంత అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. గంగా–కావేరి, గోదావరి–కావేరి నదుల అనుసంధానంతో దక్షిణ భారత రాష్ట్రాలకు దీర్ఘకాలికంగా భారీ ప్రయోజనాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఉత్తర భారత్‌లో కేన్–బేత్వా ప్రాజెక్టుతో నదుల అనుసంధానం మొదలైందని గుర్తుచేశారు. ఇదే తరహాలో ప్రాజెక్టులు దక్షిణాదిలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎల్‌నినో ప్రభావం కారణంగా ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహం తగ్గుతుందని చంద్రబాబు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటి వినియోగంలో రాష్ట్రాలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు సూచించారు. మూడు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంతోనే నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు సాధ్యమన్నారు.
రైతుల కోసం 3 రాష్ట్రాల ఐక్యత :
తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం అనేది సాగునీటి భద్రత, రైతుల సంక్షేమం, అంతర్రాష్ట్ర జల సహకారానికి ప్రతీకగా నిలిచింది. మూడు రాష్ట్రాల నేతలు ఒకే వేదికపై చేరి నీటి వనరుల పరిరక్షణ, సమర్థ వినియోగం, భవిష్యత్ అవసరాలపై ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం దక్షిణ భారత జలవనరుల చరిత్రలోనే ముఖ్యమైన ఘట్టంగా సాక్ష్యాత్కరించింది.
