PayTm Recruitment: పేటీఎంలో 4000 కొత్త ఉద్యోగాలు.. మరోపక్క తొలగింపులు.. ఈ సీక్రెట్ స్ట్రాటజీ వెనుక అసలు కథ ఇదేనా?
భారతీయ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం (PayTm Recruitment) వ్యాపార విస్తరణ, సాంకేతిక అభివృద్ధి లక్ష్యంగా సరికొత్త పునర్నిర్మాణ వ్యూహాన్ని ప్రకటించింది.
- V Santhosh Kumar
- Updated on- June 9, 2026 / 03:23 PM IST
Paytm recruitment drive hiring 4000 new staff while firing 400 employees
- పేటీఎంలో 4,000 కొత్త ఉద్యోగాలు
- ఏఐ టెక్నాలజీపై ప్రధాన దృష్టి
- సంక్షోభం దాటి లాభాల బాట
PayTm Recruitment: భారతీయ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం (PayPay) వ్యాపార విస్తరణ, సాంకేతిక అభివృద్ధి లక్ష్యంగా సరికొత్త పునర్నిర్మాణ వ్యూహాన్ని ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఉత్పత్తుల సృష్టి, మర్చంట్ నెట్‌వర్క్ బలోపేతం కోసం సంస్థ శ్రామిక శక్తిని 10 శాతం మేర పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాబోయే తొమ్మిది నెలల్లో అంటే మార్చి 2027 నాటికి సుమారు 4,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.
భారీ నియామకాలు.. స్వల్ప కోతలు:
ఒకవైపు ప్రొడక్ట్, టెక్నాలజీ, ఏఐ విభాగాలతో పాటు సీనియర్ లీడర్‌షిప్ పాత్రల కోసం భారీగా రిక్రూట్‌మెంట్(PayTm Recruitment) చేపడుతూనే, మరోవైపు అంతర్గత ప్రక్షాళనకు పేటీఎం శ్రీకారం చుట్టింది. వార్షిక పనితీరు మదింపు ఆధారంగా దాదాపు 400 మంది సిబ్బందిని అంటే మొత్తం సిబ్బందిలో 1 శాతం ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ సిద్ధమైంది. ప్రస్తుతం 40,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్న ఈ సంస్థలో, గత రెండు నెలల్లోనే ఇప్పటికే 800 మందికి పైగా కొత్త నియామకాలు పూర్తయ్యాయి.
సంక్షోభం దాటి లాభాల బాటలోకి:
గతంలో పేటీఎం బ్యాంకింగ్ విభాగంపై ఆర్‌బీఐ కఠిన ఆంక్షలు విధించడంతో కంపెనీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొని, దాదాపు 4,500 మంది సిబ్బందిని తగ్గించుకోవాల్సి వచ్చింది. అయితే ఆ నియంత్రణ సవాళ్ల నుంచి కోలుకున్న పేటీఎం, వరుసగా నాలుగు త్రైమాసికాల్లో లాభాలను నమోదు చేస్తూ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. ఇప్పుడు కేవలం డిజిటల్ చెల్లింపులకే పరిమితం కాకుండా రుణాలు, పెట్టుబడి ఉత్పత్తులు వంటి ఇతర ఆర్థిక సేవలను విస్తృతం చేయడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి సారించింది.
