Petrol Diesel Price Hike: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి నుంచే అమల్లోకి..
Petrol Price Hike : ఊహించనట్లే జరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం ఉదయం నుంచే పెరిగిన రేట్లు అమల్లోకి వచ్చాయి.
- Harish Thanniru
- Updated on- May 15, 2026 / 11:18 AM IST
Petrol And Diesel Prices Have Increased from Today
Petrol Diesel Price Hike : ఊహించనట్లే జరిగింది. ఆయిల్ కంపెనీలు వాహనదారులకు బిగ్ షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై రూ.3.14 పెరగ్గా.. డీజిల్ పై రూ.3.11 పెరిగింది. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6గంటల నుంచే అమల్లోకి వచ్చాయి.
పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ కారణంగా దేశంలోని ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయి. దీనికితోడు దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇప్పటికే ఉన్న నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ సైతం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
Also Read: ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ ఖతం.. 20 గంటలు కరెంట్ కోతలు..
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చాయి. ఈ క్రమంలో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. పొదుపు సూచనలు చేశారు. ముఖ్యంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, సొంత వాహనాలకు బదులు కార్ పూలింగ్, ప్రభుత్వ రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని.. ఇలా పలు రకాల సూచనలను ప్రధాని నరేంద్ర మోదీ చేశారు.
దేశీయంగా గత రెండు నెలలుగా ప్రతి నెలా 37లక్షల టన్నుల పెట్రోల్, 85లక్షల టన్నుల డీజిల్ వినియోగం ఉంటోంది. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ( ఓఎంసీ)పై భారం భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆయిల్ కంపెనీలకు సుమారు రూ.55,416 కోట్ల మేర నష్టాలు వస్తున్నట్లు అంచనా.
వాస్తవానికి దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మరుసటి రోజే పెట్రోల్, డీజిల్ పెరుగుతాయని ప్రచారం జరిగింది. దీంతో దేశం వ్యాప్తంగా పెట్రోల్ బంక్ ల ముందు వాహనదారులు బారులు తీరారు. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో పెంచబోమని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో పరిస్థితులు సర్దుమణిగాయి. తాజాగా.. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ఇవే..
- హైదరాబాద్ : పెట్రోల్ రూ. 110.50, డీజిల్ రూ.98.70
- విజయవాడ : 113.03, డీజిల్ రూ. 100.71
- ఢిల్లీ: పెట్రోల్ రూ.97.77, డీజిల్ రూ.90.67
- ముంబై: పెట్రోల్ రూ.106.54, డీజిల్ రూ.93.03
- బెంగళూరు: పెట్రోల్ రూ.105.96, డీజిల్ రూ.93.99
- చెన్నై: పెట్రోల్ రూ.103.80, డీజిల్ రూ.95.39
