×
Ad

Petrol Diesel Shortage: భారత దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందా? ఇందులో నిజమెంత? చమురు కంపెనీలు ఏం చెబుతున్నాయి

మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన ధరలు పెరిగాయి. ఈ వివాదం ఇంధన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

  • Published On : March 8, 2026 / 06:11 PM IST

Petrol Diesel Shortage Representative Image (Image Credit To Original Source)

  • దేశంలో ఇంధన కొరత లేదు
  • తగినంత పెట్రోలియం నిల్వలు ఉన్నాయి
  • పౌరులు భయాందోళనకు గురికావద్దు
  • పెట్రోల్ పంపుల్లో రద్దీగా ఉండొద్దు

Petrol Diesel Shortage: మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు భారత్ పైనా ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం కారణంగా భారత దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుందనే ప్రచారం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని చోట్ల ముందు జాగ్రత్తగా వాహనదారులు పెట్రోల్, డీజిల్ ను కొని భద్రపరుచుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ అయిపోతుందేమోనేని, ధరలు పెరుగుతాయేమోనని కంగారు పడుతున్నారు.

దీనిపై భారత దేశంలోని చమురు కంపెనీలు కీలక ప్రకటన చేశాయి. పెట్రోల్, డీజిల్ కొరత పుకార్లను కొట్టిపడేశాయి. దేశంలో ఇంధన నిల్వలు తగినంతగా ఉన్నాయని PSU చమురు మార్కెటింగ్ కంపెనీలు ధృవీకరించాయి.

ఆ పుకార్లలో నిజం లేదు, అవి పూర్తిగా నిరాధారమైనవి..

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) రెండూ ఇంధన కొరత పుకార్లను తోసిపుచ్చాయి. అవి పూర్తిగా నిరాధారమైనవని పేర్కొన్నాయి. ”భారత దేశ ఇంధన సరఫరా నమ్మదగినది. తగినంత పెట్రోలియం నిల్వలు, నిరంతర సరఫరా గొలుసులతో ఉంది. కొన్ని ప్రాంతాలలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని కొన్ని పుకార్లు వచ్చాయి. అవి పూర్తిగా నిరాధారమైనవి” అని బీపీసీఎల్ తెలిపింది.

”ఇంధన లభ్యత గురించి ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదు. వినియోగదారులకు సజావుగా ఇంధన సరఫరాను నిర్ధారించడంలో BPCL పూర్తిగా కార్యాచరణలో ఉంది. దృఢంగా ఉంది” అని స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్ కొరతను సూచిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన నివేదికలు పూర్తిగా నిరాధారమైనవని IOCL సైతం తేల్చి చెప్పింది. “భారత దేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయి. సరఫరా పంపిణీ నెట్‌వర్క్‌లు సాధారణంగా పని చేస్తున్నాయి” అని ఐవోసీఎల్ వెల్లడించింది.

“దేశవ్యాప్తంగా నిరంతరాయంగా ఇంధన సరఫరాను నిర్వహించడానికి ఇండియన్ ఆయిల్ కట్టుబడి ఉంది. పౌరులు భయాందోళనలకు గురికావద్దు. ఫ్యూయల్ స్టేషన్లలో రద్దీగా ఉండొద్దు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక వనరులపై మాత్రమే ఆధారపడాలి” అని కంపెనీ తన X హ్యాండిల్‌లో తెలిపింది.

శుక్రవారం చమురు మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు ప్రతికూల జోన్‌లో ముగిశాయి. BPCL దాదాపు 2 శాతం తగ్గి రూ.352.95కి చేరుకుంది. IOCL దాదాపు 2 శాతం తగ్గి రూ.168.10కి చేరుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియాలో ఈ షేర్లు నష్టపోయాయి.

దేశీయ, వాణిజ్య LPG ధరలు పెంపు..

ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) శనివారం దేశీయ, వాణిజ్య LPG సిలిండర్ల ధరలను పెంచాయి. గృహ వంట గ్యాస్ ధర రూ.60, వాణిజ్య సిలిండర్ల ధర రూ. 114.5 పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం సబ్సిడీ లేని దేశీయ LPG ధర ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌కు రూ.913 కు పెరిగింది. ఇది గతంలో రూ.853గా ఉంది. హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు సాధారణంగా ఉపయోగించే వాణిజ్య LPG సిలిండర్లు కూడా యూనిట్‌కు రూ.114.5 పెరిగాయి.

మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన ధరలు పెరిగాయి. ఈ వివాదం ఇంధన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. కీలకమైన ప్రపంచ చమురు, గ్యాస్ మార్గాల్లో సరఫరా స్థిరత్వంపై ఆందోళనలను లేవనెత్తింది. ఇంధన మార్కెట్లలో అస్థిరత LPG ధరల పెరుగుదలకు కారణమైంది. మిడిల్ ఈస్ట్ లో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. దీంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.

Also Read: అమెరికాలో విజృంభిస్తున్న వైరస్.. దీనికి ట్రీట్‌మెంటే లేదు..